28 April, 2026 | 2:47 PM

పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై నిరసన.. ఆటోను తాడుతో లాగిన సీఐటీయూ నాయకులు

28-04-2026 11:48 AM

దమ్మపేట,(విజయక్రాంతి): దేశంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతను నివారించాలని, ఆయిల్ సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని కోరుతూ, సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆటోను తాళ్లతో లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ మాట్లాడుతూ పాలకుల వైఫల్యాన్ని నిరసిస్తూ ప్రజలకు నిత్యవసరంగా మారిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ మాత్రం అందుబాటులో లేదని, ప్రస్తుతం పెళ్లిళ్లు, వ్యవసాయ సీజన్ ముమ్మరంగా ఉన్న టైంలో ఆయిల్ కొరతను సృష్టించి రేట్లు పెంచేందుకే ఆయిల్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని, దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని, కేంద్రంలో మోడీ ప్రభుత్వం అమెరికాకు, ట్రంప్ కు లొంగిపోయి రష్యా ఇతర దేశాల నుండి చౌకగా ఆయిల్ కొనుగోలుకు అవకాశాలున్నా ట్రంప్ ఆదేశాలకు లొంగి దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారని అన్నారు.

పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారీగా పెంచేందుకు కేంద్ర ప్రయత్నిస్తుందని, తక్షణమే బ్లాక్ మార్కెట్ ను అరికట్టి రవాణా వాహనాలతో పాటు రైతులకు, ప్రజలకు అవసరమైన గ్యాస్, పెట్రోల్, డీజిల్ సక్రమంగా అందించాలని, ఆయిల్ కొరతను తీర్చకపోతే ప్రజాగ్రహానికి పాలకులు గురికాక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు , కౌలూరి రామకృష్ణ, యుగంధర్, ప్రసాద్, ఆదినారాయణ, యశోద, నాగు ఆటో కార్మికులు, హమాలీలు, ఇతర కార్మికులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.