26 August, 2026 | 9:01 PM

సైబర్ క్రైమ్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ వెంకట్ రెడ్డి

26-08-2026 08:05 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ....పీఎం కిసాన్ యోజన పేరుతో వచ్చిన APK ఫైల్‌ను ఓపెన్ చేసి ఓ వ్యక్తి సైబర్ మోసానికి గురయ్యాడు. ఫైల్‌ను క్లిక్ చేయగానే ఫోన్ హ్యాక్ కావడంతో.. అతని బ్యాంక్ ఖాతా నుంచి మూడు విడతల్లో మొత్తం రూ.97 వేల నగదు డెబిట్ అయింది. హ్యాక్ కావడంతో వెంటనే అప్రమత్తమైన బాధితుడు 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించడంతో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

సకాలంలో ఫిర్యాదు చేయడంతో మోసపోయిన నగదు తిరిగి పొందే అవకాశం ఏర్పడింది. ఈ సందర్భంగా కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి, మాట్లాడుతూ సిర్గాపూర్/కల్హేర్/కంగ్టి మండలం, మండల పరిధిలోని ప్రజలను ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని, పీఎం కిసాన్, ఈ-కేవైసీ, ఎల్‌ఐసీ (లేదా) బ్యాంకుల పేరుతో వచ్చే అనుమానాస్పద APK ఫైల్స్, లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని సూచించారు. బ్యాంకులు ఫోన్ చేసి APK ఫైల్స్ పంపించి యాప్ ఇన్‌స్టాల్ చేయమని (లేదా) లింక్‌పై క్లిక్ చేయమని అడగవని తెలిపారు.

బ్యాంకింగ్‌కు సంబంధించిన ఏ సమస్య ఉన్నా నేరుగా బ్యాంకుకు వెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. బ్యాంక్ ఖాతాకు అనుసంధానమైన ఫోన్లను పిల్లలకు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సీఐ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. తెలియక పిల్లలు లింకులు లేదా APK ఫైల్స్ క్లిక్ చేస్తే భారీగా నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సీఐ సూచించారు. సకాలంలో ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును నిలిపివేసి, తిరిగి పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వాట్సాప్‌కు వచ్చే గుర్తుతెలియని లింకులు, APK ఫైల్స్‌ను క్లిక్ చేయవద్దని సీఐ వెంకట్ రెడ్డి సూచించారు.