హత్య కేసుని చేదించిన పోలీసులు
చౌటుప్పల్: పంతంగి గ్రామంలోని శనగలగుట్ట వద్ద అంకిరెడ్డిగూడెంకు చెందిన రాపోలు దానయ్య (36) హత్య కేసును చౌటుప్పల్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. డీఎస్పీ పి. మధుసూదన్ రెడ్డి పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ జె. మన్మథ కుమార్ ఆధ్వర్యంలో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో దానయ్య భార్య శారద (34), దానయ్య సొంత అన్న కుమారుడు రాపోలు శివ అలియాస్ చింటూ (19) కలిసి హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.
దానయ్య తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో అతడిపై దాడి చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.హత్యకు సంబంధించిన ఆధారాలను సేకరించిన పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శివ, శారదలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించడంతో పాటు, అనుమానితులను విచారించి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలిపారు. హత్య కేసును వేగంగా ఛేదించి నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేసిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ పి. మధుసూదన్ రెడ్డి అభినందించారు.






