పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్
గజ్వేల్,ఏప్రిల్ 1: పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్త బంద్ లో భాగంగా, బుధవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ చికెన్ సెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ గత కొంతకాలంగా పౌల్ట్రీ కంపెనీలు వ్యాపారులకు ఇచ్చే మార్జిన్లను తగ్గించాయన్నారు. నిర్వహణ ఖర్చులు పెరిగి, లాభాలు తగ్గి తాము అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారం చేయడం సాధ్యం కావడం లేదని చికెన్ సెంటర్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. పౌల్ట్రీ యాజమాన్యాలు వ్యాపారుల శ్రమను దోచుకుంటూ, అన్యాయమైన నిబంధనలతో ఇబ్బందులకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు.
తగ్గించిన మార్జిన్లను వెంటనే పునరుద్ధరించి, వ్యాపారులకు న్యాయం చేసే వరకు మా నిరసన కొనసాగుతుందన్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు షాపులను మూయడానికి వెనుకాడబోమని సంఘం నాయకులు తేల్చి చెప్పారు. పౌల్ట్రీ కంపెనీల అన్యాయానికి వ్యతిరేకంగా తాము చేస్తున్న ఈ పోరాటంలో ప్రజలు, వినియోగదారులు సహకరించాలని అసోసియేషన్ కోరింది. సామాన్యుడికి తక్కువ ధరకు చికెన్ అందాలన్నా, చిన్న వ్యాపారులు బతకాలన్నా ఈ పోరాటం తప్పనిసరన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ చికెన్ సెంటర్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షులు ఇమామ్, హుస్సేన్, తిరుపతి, కార్యదర్శులు రాజు, ముస్తఫా, మాజీ అధ్యక్షులు శేఖర్, జహీర్, సభ్యులు బాలకృష్ణ, గౌస్, నాగరాజు, రఫీ, షాదుల్లా, సత్తయ్య, స్థానిక వ్యాపారులు పాల్గొన్నారు.




