ఐఏఎస్, ఐపీఎస్‌లను మారిస్తే ఫలితాలు రావు
- యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణ టెండర్ల వివరాలు త్వరలో బయటపెడతా
మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి) : ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పూట పూటకు మార్చడం వల్ల పాలనలో ఫలితాలు రావని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఇప్పటి వరకు ఐదు సార్లు భారీగా మార్పులు చేర్పులు జరిగాయని, రేవంత్‌రెడ్డికి పాలన రావడం లేదని ఎద్దేవా చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో హరీశ్‌రావు చిట్ చాట్ నిర్వహించారు.
విద్యుత్ శాఖలో ఈ రెండేళ్ల కాలంలో ఐదుగురు అధికారులు మారారని, సింగరేణిలో కూడా నలుగురు, జీహెచ్‌ఎంసీలో నలుగురు, ఐ అండ్ పీఆర్‌లో నలుగు రు, పాఠశాల విద్యాశాఖలో నలుగురు, ఆరోగ్య శ్రీలో ఎనిమిది మంది, పంచాయతీ రాజ్ శాఖలో నలుగురు, మున్సిపల్ శాఖ లో ఐదుగురు, ఐటీ శాఖలో ముగ్గురు, మై నింగ్ శాఖలో ఆరుగురు, నేషనల్ హెల్త్ మిషన్‌లో ముగ్గురు అధికారులను మార్చారని గుర్తు చేశారు.
140 మంది ఐఏఎస్‌లను బదిలీ చేశారని, 20 మంది కలెక్టర్లను మార్చారని, రంగారెడ్డి జిల్లాలో నలుగురు కలెక్టర్లు మారారని వివరించారు. ఢిల్లీతో సమన్వయం ఉండాల్సిన కీలక శాఖల్లో అధికారులను తరచూ మార్చడం వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందని తెలిపారు. సీఎం, మంత్రులకు నచ్చక పోతే అధికారులకు బదిలీలు తప్పడం లేదని, పదవీ విరమణ చేసిన అధి కారులకు సర్వీస్ పొడగింపు సాధారణం అయిపోయిందన్నారు.
యంగ్ ఇండి యా స్కూళ్ల నిర్మాణ టెండర్లలో ఐదు శాతం ఎక్కువకు ఇస్తున్నారని ఆరోపించారు. తమ అక్రమాలకు అధికారులు సహకరించడం లేనందుకే సీఎం వారిని బదిలీ చేస్తున్నారు.. బెదిరి స్తున్నారని మండిపడ్డారు. 20 శాతం జీవోలు ఆన్ లైన్‌లో ఉంచుతున్నారు.. 80 శాతం జీఓలు ఆఫ్ లైన్‌లో ఉంచుతున్నారని ఆరోపించారు. కోర్టు ఆదేశించినా జీవోలు ఆన్ లైన్‌లో పెట్టడం లేదన్నారు.
వరంగల్ ఎంజీఎంలో ఎలుకలు, జడ్చర్ల ఆస్పత్రిలో కుక్కలు.. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి ఇట్లా తయారైందన్నారు. రేవంత్ రెడ్డి మేనల్లుడి మనుషులు నియో పొలీస్‌లో అక్రమ మైనింగ్ చేస్తున్నారని, మొబైల్ క్రషింగ్ ప్లాంట్‌కు మాత్రమే నిబంధనలుండగా ఫికస్డ్ క్రషింగ్ ప్లాంట్ నియోపోలిస్‌లో పెట్టారని ఆరోపించారు. ల్యాండ్ లీజుకు ఇస్తే 6 నుంచి 7 శాతం ఫీజు కట్టాలని, లెటర్‌లో పది ఎకరాలు ఇస్తే 15 ఎకరాల్లో మైనింగ్ జరుగుతోందన్నారు. 15 లక్షల క్యూబిక్ మీటర్ల బండకు ఫీజు ఎగ్గొట్టారని, అక్కడ రెడీమిక్స్‌కు పర్మిషన్ లేదని హరీశ్‌రావు తెలిపారు.




