20 March, 2026 | 4:37 AM

ఎల్బీనగర్‌లో ‘ఛాలెంజ్’ ఫైట్

20-03-2026 01:06 AM
  1. బీఆర్‌ఎస్ నేతలకు ‘సే నో డ్రగ్స్’ పేరుతో కాంగ్రెస్ వైట్ ఛాలెంజ్’
  2. శాంపిల్స్ ఇచ్చేందుకు వచ్చిన యువజన కాంగ్రెస్ నాయకులు 
  3. కార్యకర్తలతో తరలివచ్చిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
  4. ఇరువర్గాల పోటాపోటీ నినాదాలు
  5. అరెస్టు చేసిన పోలీసులు 

ఎల్బీనగర్, మార్చి 19: ఉగాది పండుగ రోజున ఎల్బీనగర్‌రింగ్ రోడ్డు యుద్ధ వాతావరణంగా మారింది. సే నో డ్రగ్స్ పేరిట శాంపిల్స్ ఇవ్వాలని ఎల్బీనగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి, నాయకులకు యూత్ కాంగ్రెస్ నాయకులు వైట్ ఛాలెంజ్ సవాల్ చేశారు. ఈ క్రమంలో గురువారం మధ్యా హ్నం ఎల్బీనగర్ రింగ్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్దకు ముందుగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ నాయకులు వచ్చి, రక్తం శాంపిల్స్ ఇచ్చారు. సవాల్‌ను స్వీకరించిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి వచ్చారు.

తాము సైతం శాంపిల్స్ ఇస్తామని, తమ వెంట పోలీసులు రావాలని ఎమ్మెల్యే కోరా రు. అదే సమయంలో ఇరుపార్టీల నాయకులు వాగ్వాదానికి దిగారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణ య్య ఆధ్వర్యంలో ఇరుపార్టీల నాయకులను చెదరగొట్టారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితోపాటు బీఆర్‌ఎస్ నాయకులను అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకుని తమను అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారని, ఇది కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి, చిల్లర రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. సవాళ్లు విసిరిన తర్వాత వాటికి సమాధానం చెప్పేందుకు వెనక్కి తగ్గడం కాంగ్రెస్ నాయకుల వైఫల్యా న్ని చూపుతోందన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ ఉనికి కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నట్లు విమర్శించారు.

ప్రశాంతంగా ఉన్న ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తాము ఎప్పుడైనా, ఎక్కడైనా డ్రగ్ టెస్ట్కు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తమ నాయకుడు కేటీఆర్‌పై చేసిన డ్రగ్స్ ఆరోపణలు కూడా నిరాధారమని, ఆయన కూడా ఎప్పుడైనా పరీక్షలకు సిద్ధంగా ఉన్నారని గుర్తుచేశారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి మాట్లాడుతూ..

తాను, తన కుటుంబం సభ్యులతో పాటు కాంగ్రెస్ నాయకులందరూ డ్రగ్స్ టెస్ట్‌కు శాంపిల్స్ ఇచ్చామన్నారు. కానీ, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి డ్రగ్స్ టెస్ట్‌కు వచ్చి, శాంపిల్స్ ఇవ్వకుండా కావాలనే రెచ్చగొట్టే విధంగా చేశారని ఆరోపించారు. శాంతియుతంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు టెస్ట్ లు ఇస్తుంటే కావాలని గొడవ చేయడం ఏమిటని? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తన అనుచరులు డ్రగ్స్ టెస్ట్ చేపించుకొని వైట్ ఛాలెంజ్‌కు కట్టిబడి ఉండాలన్నారు.

- రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రామ్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణను డ్రగ్స్ రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. కేటీఆర్ ప్రవర్తిస్తున్న తీరు తన అనుచరులను డ్రగ్స్‌కు బానిసగా మార్చారనే విధంగా ఉందన్నారు.

కేటీఆర్ స్వచ్ఛందంగా డ్రగ్స్ టెస్ట్‌కు ముందుకు రావాలని సవాల్ చేశారు. కార్యక్రమంలో పీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖరెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం శ్యామ్ చరణ్‌రెడ్డి, రామ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్నాల జైపాల్‌రెడ్డి, బుడ్డా సత్యనారాయణ, అశోక్‌గౌడ్, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని రవీందర్‌గౌడ్ పాల్గొన్నారు.