రవాణా వ్యవస్థ మెరుగుపరిస్తేనే అభివృద్ధి సాధ్యం
జిల్లాలో రోడ్ల అభివృద్ధికి రూ 900 కోట్లు మంజూరు
తాండూరు లో 290 కోట్ల రూపాయలతో రోడ్ల పనులకు శంఖస్థాపనలు చేసిన మంత్రులు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు.
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లాలో రోడ్ల అభివృద్ధికి, నిర్మాణాల కోసం 900 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం తాండూర్ నియోజక వర్గంలో 290 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణాలు, బలోపేతం చేయడానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బుయ్యని మనోహర్ రెడ్డి, కాలె యాదయ్య, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీలతో కలిసి రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .... రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాల నిమిత్తం అత్యధిక నిధులను కేటాయించి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా తాండూరు నియోజకవర్గానికి 290 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని. .రోడ్ల సౌకర్యం మెరుగ్గా ఉంటే పరిశ్రమలు, వ్యాపారాలు వృద్ధి చెందుతాయని అలాగే ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని అన్నారు. మంజూరు అయిన పనులు వెంటనే ప్రారంభిస్తామని. . ప్రజా పాలన లో భాగంగా 30 మాసాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లోనే 900 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని తెలిపారు.
కోర్టు కేసు పరిష్కారం అయిన వెంటనే 94 కోట్ల వ్యయంతో పాత తాండూరు రైల్వే ఓవర్ వే బ్రిడ్జి పనులను 18 వారాల్లో చేపడతామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ.... ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తూనే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. 290 కోట్ల వ్యయంతో ప్రధాన రహదారులను నిర్మించేందుకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని... రవాణా వ్యవస్థ మెరుగుపరిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
కాగ్న నదిలో మురుగునీరు కలవకుండా 30 కోట్లను మంజూరు చేసి పనులు మొదలు పెట్టడం జరిగిందని మంత్రి అన్నారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయలను మాఫీని ప్రభుత్వం చేపట్టిందన్నారు. గ్రూప్-1, గ్రూప్-2 తదితర పరీక్షలు నిర్వహించి 70 వేల మందికి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించామని అన్నారు .విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం తో పాటు ఉదయం అల్పాహారం సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని ఆయన అన్నారు.
అంతర్గత మురుగు కాలువల సమస్యలపై ప్రణాళికలు సిద్ధం చేస్తే అనుమతులు ఇస్తామని మంత్రి అన్నారు. శాసన మండలి చీఫ్ విప్ పి.మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం పేదల అభ్యున్నతి కృషి చేస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేయబడుతుందన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రోడ్ల అభివృద్ధికి అధిక నిధులు మంజూరి అయ్యాయని, రోడ్ల అభివృద్ధితో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని అన్నారు. కర్ణాటక సరిహద్దు రోడ్లకు నిధులను కేటాయించి అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని తెలిపారు.






