నీట్ పరీక్ష అవకతవకలపై కేంద్రం బాధ్యత వహించాలి
ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు ఎండి ఆసిఫ్ అలీ
ఆసిఫాబాద్(విజయక్రాంతి): నీట్ పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలపై ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ఎండి ఆసిఫ్ అలీ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత పదేళ్లలో ప్రశ్నాపత్రాల లీకేజీలు పదేపదే జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించలేని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
‘వన్ నేషన్ - వన్ ఎలక్షన్’ అంటూ దేశ ప్రజలను మభ్యపెడుతున్న బీజేపీ ప్రభుత్వం, ‘వన్ నేషన్ - వన్ ఎగ్జామ్’ను కూడా పారదర్శకంగా నిర్వహించలేకపోతోందని విమర్శించారు. విద్యార్థుల కన్నీళ్లు, తల్లిదండ్రుల కష్టాలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ స్కామ్ వెనుక ఉన్న వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తే దేశ యువత క్షమించదని హెచ్చరించారు. డబ్బున్న వారికి మాత్రమే అవకాశాలు కల్పిస్తూ పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికైనా స్పందించాలని, లేకపోతే విద్యార్థుల ఆగ్రహం దేశవ్యాప్తంగా ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు.






