13 May, 2026 | 3:05 AM

జిల్లాలో కొనసాగుతున్న జనగణన

13-05-2026 12:00 AM

33 రకాల వివరాలు సేకరిస్తున్న అధికారులు

ఎల్లారెడ్డి, మే 12 (విజయక్రాంతి): జిల్లావ్యాప్తంగా జనగణన పక్కాగా కొనసాగుతోంది. అధికారుల నేతృత్వంలో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కుటుంబాల వివరాల సేకరిస్తున్నారు.

 గృహ జాబితాలో..

గృహజాబితా సేకరణలో ప్రతి ఇంటి నిర్మాణ స్వభావం, కుటుంబీకుల వివరాలు, తాగునీరు, విద్యుత్, శౌచాలయాలు సహా మొత్తం 33 రకాల వివరాలను ఎన్యూమరేటర్లు ‘హెచ్‌ఎల్పీసీ’ మొబైల్ యాప్లో నమోదు చేస్తున్నారు. ఆయా వీధుల్లో ఉన్న ఆలయాలు, మసీదులు, చర్చిలు, రహదారులు, ప్రధాన స్థలాలను కూడా యాప్లో పొందుపరుస్తున్నారు. జూన్ 9 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. మొదటి మూడు రోజుల పాటు గృహాల మ్యాపింగ్ ప్రక్రియ చేయనున్నారు.

జనగణన ప్రక్రియ పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో అధికారులకు బాధ్యతలు అప్పగించారు. జిల్లా కలెక్టర్ ముఖ్య గణాంకాధికారిగా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అదనపు ముఖ్య గణాంకాధికారిగా, డీఆర్వో గణాంకాధికారిగా వ్యవహరిస్తారు. సీపీవో, డీఈవో, జెడ్పీ సీఈవో, డీఎంఈవోలు నేతృత్వ అధికారులుగా, పురపాలకాల కమిషనర్లు, మండల స్థాయిలో తహసీల్దార్లు ఛార్జ్ అధికారులుగా, ఎంపీడీవో, అటవీశాఖ టాస్క్ఫోర్స్ అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

 ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

జనగణన ముసుగులో కొందరు ఇళ్లలోకి వచ్చి వివరాలు సేకరించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గణనకు వచ్చే వారు నిజమైన అధికారులేనా అని నిర్ధారించుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి ఎన్యుమరేటర్కు ప్రత్యేక గుర్తింపు కార్డును జారీ చేసిందని, వివరాలు చెప్పే ముందు గుర్తింపు కార్డును తనిఖీ చేసి, వారు ధరించి ఉన్నారో లేదో చూడాలని అధికారులు సూచించారు.