17 August, 2026 | 6:47 PM

గోపాల్‌పూర్‌లో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శ్రీకారం

17-08-2026 05:38 PM

రూ.25 లక్షల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభం

మంథని, ఆగస్టు 17 (విజయక్రాంతి): మంథని మండలం గోపాల్‌పూర్ గ్రామంలోని ఐదో వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. రూ.25 లక్షల నిధులు మంజూరు కావడంతో వార్డు సభ్యుడు కొప్పుల రాఘవ పటేల్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో నిధులు మంజూరయ్యాయని నాయకులు తెలిపారు. సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణంతో వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు పారిశుద్ధ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబులకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నాయకులు సూచించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేడ రాజయ్య, ఉపసర్పంచ్ దాసరి రమాదేవి, వార్డు సభ్యులు సుంకరి రవి, జంగం సుమన్, పద్మ, సరిత, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొప్పుల భూమయ్య, చంద్రు, రాజమల్లు, రాజయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.