13 May, 2026 | 2:10 AM

వరి, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి

13-05-2026 12:00 AM
  1. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  2. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో ఆదేశం

కామారెడ్డి, మే 12 (విజయక్రాంతి): రాష్ట్రంలోని రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క), తుమ్మల నాగేశ్వర్ రావు లతో కలిసి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు ప్రభుత్వ నిర్దేశిత విధానాల ప్రకారం సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ధాన్యం రవాణాలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు.

కొనుగోలు కేంద్రాలలో గోనె సంచులు, టార్పాలిన్లు, క్లీనింగ్ మెషీన్లు తదితర అవసరమైన పరికరాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. హమాలీల సమస్యలు ఎక్కడా తలెత్తకుండా గుత్తేదారులు ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, నిర్లక్ష్యం వహించిన పక్షంలో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హెచ్చరించారు.  ప్రతి జిల్లాలో కొనుగోలు ప్రక్రియ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వరి ధాన్యం కొనుగోలు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాల ద్వారానే జరగాలని సూచించారు, నేరుగా మిల్లులకు తరలించే చర్యలు చేపట్టవద్దని మిల్లర్లకు వివరించాలని తెలిపారు. టోకెన్ వ్యవస్థ, రసీదు విధానం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమలు చేయాలని ఆదేశించారు. అకాల వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ధాన్యం రక్షణ కోసం అన్ని పిపిసిలు, మిల్లుల వద్ద తగినన్ని టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని డి ఎం ఓ కు ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు, రవాణా, ట్యాబ్ ఎంట్రీలు, ట్రక్ చిట్ జనరేషన్, మిల్లర్ అక్నాలెడ్జ్మెంట్ ప్రక్రియలను నిర్ణీత గడువులో పూర్తి చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గిరి, సివిల్ సప్లై అధికారి వెంకటేష్, డి సి ఓ రామ్మోహన్, వ్యవసాయ శాఖ అధికారి జ్యోతి, మార్కెటింగ్ అధికారి రమ్య, డి ఆర్ డి ఎ పి డి సురేందర్, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, సివిల్ సప్లై మేనేజర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.