భిక్కనూర్ మండలంలో వడగళ్ల వాన
24-03-2026 09:23 PM
– వరి, మొక్కజొన్న పంటల నష్టం
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి, కంచర్ల గ్రామాల్లో మంగళవారం వడగళ్ల వాన కురవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చేతికి వచ్చిన వరి, మొక్కజొన్న పంటలు వడగళ్ల ప్రభావంతో నేలకూలి నష్టపోయాయి. పొట్టదశలో ఉన్న వరి గింజలు పగిలిపోవడంతో పంట పూర్తిగా దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వడగళ్ల కారణంగా మొక్కజొన్న పంటలు కూడా పూర్తిగా నేలకొరిగాయి. ఎంతో కష్టపడి పండించిన పంటలు నష్టపోవడంతో రైతులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి నష్టం అంచనా వేసి అర్హులైన రైతులకు పరిహారం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.




