20 March, 2026 | 3:55 PM

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదం

20-03-2026 12:00 AM

ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడి

ఆదిలాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): ఒక సీసీ టీవీ కెమెరా 100 మంది సిబ్బందితో సమానం అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో నిఘా వ్యవస్థను బలపరిచే దిశగా సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు కీలకమని వివరించారు.  తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 21 సీసీ టీవీ కెమెరాలను గురువారం ఆయన ప్రారంభించారు. మొదటగా గ్రామ ప్రజలు  జిల్లా ఎస్పీకి డప్పు వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు.

అనంతరం మండలంలోని ఆదర్శ యువ రైతులను ఎస్పీ సత్కరించి బహుమతి ప్రధానం చేసి సన్మానించారు. కజ్జర్ల గ్రామ రామాలయాన్ని సందర్శించి పూజా కార్యక్రమాల నిర్వహించారు. ప్రజలందరికీ ఉగాది పండుగ సంద ర్భంగా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అటు గ్రామీణ ప్రాం తాల్లో గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, చిన్నచిన్న నేరాలు, రోడ్డు ప్రమాదాలు వంటి సమస్యలను సమర్థవంతంగా నియంత్రించడానికి సీసీ టీవీలు ఉపయోగపడతాయని ఎస్పీ తెలిపారు.

అదేవిధంగా మహిళల భద్రత, రాత్రి వేళల్లో కదలికల పర్యవేక్షణ, అనుమానాస్పద వ్యక్తుల గుర్తింపు వంటి అంశాల్లో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. సీసీటీవీ కెమెరాల వల్ల నేరాలు జరగకుండా ముందుగానే నిరోధించడమే కాకుండా, జరిగిన ఘటనలపై స్పష్టమైన ఆధారాలు లభించడం వల్ల విచారణ వేగవంతం అవుతుందని, నిందితులను త్వరగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం సులభమవుతుందని వివరించారు.

ప్రతి గ్రామం గంజాయి రహితంగా ఉండటం, రోడ్డు భద్రతా నిబంధనలు కచ్చితంగా అమ లు చేయడం, మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు వంటి నాలుగు ముఖ్య అంశాలను పాటిస్తే ఆ గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా నిలుస్తాయని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి జీవన్ రెడ్డి, రూరల్ సీఐ ఫణిదర్, తలమడుగు ఎస్‌ఐ రాధిక, సర్పంచ్ ఎల్మా నారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ అగ్గిమల్ల గంగన్న, గ్రామ పెద్ద చితలపెల్లి దేవరెడ్డి, అగ్రికల్చర్ ఏడి నర్సయ్య, నాయకులు అగ్గిమల్ల గణేష్, వార్డ్ మెంబర్లు, గ్రామ పెద్దలు తదిరులు పాల్గొన్నారు.