గచ్చిబౌలిలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం కేసు ఛేదింపు
రంగారెడ్డి ఆగస్టు25( విజయక్రాంతి): గచ్చిబౌలిలోని లేబర్ క్యాంప్ నుంచి అదృశ్యమైన ఇద్దరు చిన్నారులను పోలీసులు గంటల వ్యవధిలోనే గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రమీలా ముర్ము (4), సంగీత (3) అనే చిన్నారులను దుకాణానికి తీసుకెళ్తానని చెప్పి వారి తల్లిదండ్రుల సహోద్యోగి సోరెన్ తీసుకెళ్లాడు. అనంతరం చిన్నారులు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితుడు సోరెన్‌ను ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. చిన్నారులను సురక్షితంగా గుర్తించిన పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో గచ్చిబౌలి పోలీసులు గంటల వ్యవధిలోనే చిన్నారుల అదృశ్యం కేసును ఛేదించారు.






