16-02-2026 12:02:35 AM
ముంబై, ఫిబ్రవరి 15 : టీ20 ప్రపంచకప్ లో వెస్టిండీస్ సూపర్-8కు దూసుకెళ్లింది. నేపాల్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కరేబియన్ టీమ్ హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బౌలింగ్‌లో జేసన్ హోల్డర్ మ్యాజిక్ చేసి నేపాల్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు. బ్యాటింగ్‌లో హోప్ , హెట్ మెయిర్ దుమ్మురేపడంతో విండీస్ సునాయాసంగా గెలిచింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ కేవలం 23 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కుశాల్(1), ఆసిఫ్(11), రోహిత్ (5), ఆరిఫ్ షేక్(2) పరుగులకే వెనుదిరిగారు. హోల్డర్ దెబ్బకు నేపాల్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారుయ ఈ టోర్నీలో నిలకడగా రాణిస్తున్న దీపేంద్రసింగ్ మాత్రమే హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. 47 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. చివర్లో సోంపాల్ 15 బంతుల్లోనే 26 పరుగులు చేయడంతో నేపాల్ స్కోరు 130 దాటగలిగింది.
ఫలితంగా నేపాల్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో హోల్డర్ 27 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అకిల్ హొస్సేన్, మాథ్యూ హోర్డ్ , సమర్ జోసెఫ్, ఛేజ్ ఒక్కో వికెట్ తీశారు. 134 పరుగుల ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన వెస్టిండీస్ కు ఓపెనర్లు బ్రాండన్ కింగ్, షై హోప్ మంచి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 5.3 ఓవర్లలో 43 పరుగులు జోడించారు. కింగ్ 22 రన్స్‌కు ఔటైనప్పటకీ.. షై హోప్ , హెట్‌మెయిర్ మెరుపులు మెరిపించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 91 పరుగులు జోడించారు. దీంతో విండీస్ కేవలం 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. హోప్ కేవలం 44 బంతుల్లో 61 నాటౌట్ , హెట్‌మెయిర్ 32 బంతుల్లో 46 నాటౌట్ రాణించారు.