10 March, 2026 | 7:41 PM

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హైదరాబాద్ వరకు బస్సు సౌకర్యం

10-03-2026 05:54 PM

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండి మంగళవారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రం నుండి హైదరాబాద్ వరకు ప్రయాణం కోసం నూతన బస్సు సౌకర్యాన్ని ఆర్టీసీ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ... కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రం నుండి ఓదెల మండలం కొలనూరు, సుల్తానాబాద్ మండలం మీదుగా నూతనంగా ప్రారంభించిన బస్సు కరీంనగర్ నుండి హైదరాబాద్ చేరుకుంటుందని అక్కడి నుండి సికింద్రాబాద్ చేరుకొని తిరిగి

మళ్ళీ కరీంనగర్ మీదుగా కాల్వ శ్రీరాంపూర్ కు చేరుకొని కరీంనగర్ లో రాత్రి బస అనంతరం మళ్ళీ తిరిగి ప్రతీ రోజూ కాల్వ శ్రీరాంపూర్ నుండి ఉదయం బయలుదేరే విధంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు  సహకారంతో ఆర్టీసీ అధికారులతో చర్చించి బస్సు సౌకర్యం కల్పించామన్నారు. తాను అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే పెద్దపల్లి బస్ డిపో అనంతరం గోదావరిఖని, పెద్దపల్లి, కాల్వ శ్రీరాంపూర్ మీదుగా హనుమకొండ కు బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు.

గతంలో 1985-89 మధ్యకాలంలో స్వర్గీయ  కాల్వ రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 87-88 సంవత్సరంలో ఆరు నెలలు హైదరాబాద్ కు బస్సు సౌకర్యం ఉండేదని తిరిగి  ఇప్పుడు ఆ సౌకర్యాన్ని  కల్పించడం జరిగిందని తెలిపారు. రానున్న రోజులలో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్,మార్కెట్ చైర్మన్ లు మరియు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.