14-02-2026 12:31:25 AM
ఆమనగల్లులో ‘గులాబీ’ జెండా రెపరెపలు
స్పష్టమైన మెజార్టీతో మున్సిపల్ పీఠం కైవసం!
15 వార్డుల్లో 8చోట్ల అభ్యర్థుల విజయం
బీజేపీ 6.. కాంగ్రెస్ 1 వార్డుతో సరి
అధికార పార్టీ ఓటమితో కేడర్ నారాజ్
ఆమనగల్లు, ఫిబ్రవరి13 (విజయక్రాంతి): హోరాహోరీగా సాగిన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘనవిజయం సాధించింది. మెజార్టీ వార్డులను గెలుచుకోవడంతో మున్సిపాలిటీ పీఠం కారు వశమైంది!.శుక్రవారం వెలువడిన ఫలితాల్లో గులాబీ పార్టీ ఆధిక్యంతో దూసుకుపోయింది. మొత్తం 15 వార్డులకు జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీతో పాటు స్వతంత్రులు కలిపి మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీచేశారు. బీఆర్‌ఎస్ 15 వార్డుల్లో అభ్యర్థులను నిలిపి 8చోట్ల విజయం సాధించింది. బీజేపీ ఆరు స్థానా ల్లో గెలుపొందింది. అధికార కాంగ్రెస్ పార్టీ 15 మంది బరిలో ఉన్నా కేవలం ఒకే ఒక్క స్థానానికే పరిమితమైంది. ఇతరులు జనసేన, విద్యార్థి రాజకీయ పార్టీ, స్వతంత్రులు పోటీ చేసినా ఖాతా తెరవలేకపోయారు.
రికార్డు స్థాయిలో పోలింగ్....
ఈ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును భారీగా వినియోగించుకున్నారు. మొత్తం ఓటర్లు 16,384 కాగా, 14,803 (90.35%) ఓట్లు పోలయ్యాయి. పురుషులు 8,475 ఓట్లకు గాను 7,188 ఓట్లు పోలయ్యాయి. మహిళలు 8,500 ఓట్లకు గాను 7,615 ఓట్లు పోలు కావడంతో ఓటింగ్ పరంగా ఉత్సాహం చూపారు.
పకడ్బందీగా ఓట్ల లెక్కింపు.....
స్థానిక బ్రిలియంట్ గ్రామర్ స్కూలులో జిల్లా ఎన్నికల అధికారి జగదీశ్వర్రెడ్డి, సహాయ అధికారి శంకర్ నాయక్ పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ సాగింది. మొత్తం 5 టేబుళ్లను ఏర్పాటుచేసి 8 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేశారు. విజేతలకు అధికారులు వెంటనే ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. పోలీసుల భారీ బందోబస్తు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి నేతృత్వంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ జానకిరెడ్డి,సీఐ జానకి రామ్ రెడ్డి తో పాటు ప్రత్యేక బలగాలు కౌంటింగ్ కేంద్రం వద్ద పహారా కాశాయి.
అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ ఫ్లాప్.....
కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణం అభ్యర్థుల ఎంపికలో జరిగిన తప్పిదాలేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పట్టున్న ప్రాంతమే అయినప్పటికీ స్థానిక నేతల మధ్య సమన్వయం కుదర్చడంలో విఫలమయ్యారు. టికెట్ దక్కని అసమ్మతి నేతలు స్వతంత్రులుగా దిగడం లేదా లోపాయికారీగా ఇతర పార్టీలకు సహకరించడం పార్టీ కొంపముంచింది.
ఎన్నికల బాధ్యతలు చూసిన శ్రీనివాస్ గౌడ్ క్షేత్రస్థాయిలో కేడర్ను ఏకం చేయడంలో, బలమైన అభ్యర్థులను నిలబెట్టడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా వ్యతిరేకత నే పార్టీ కి బెడిసికొట్టింది. ఆమనగల్లు ఓటర్లు పార్టీల కంటే వ్యక్తిగత పలుకుబడి, ప్రజల్లో ఉండేవారికి మాత్రమే పట్టం కట్టారు. అధికార పార్టీ నేతలు ఇకనైనా గ్రూపు రాజకీయాలు పక్కనపెట్టి ప్రజల్లోకి వెళ్లకపోతే భవిష్యత్ లో మరిన్ని ఇబ్బందులు తప్పవు. ఎమ్మెల్యే ఇలాకాలో కాంగ్రెస్ ఓడిపోవడం అధికారపార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు.
బీఆర్‌ఎస్ రివెంజ్ స్ట్రాటజీ...
అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఆమనగల్లులో బీఆర్‌ఎస్ తన ఉనికిని చాటుకుంది. 8 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలవడం వెనుక ఆ పార్టీ పక్కా వ్యూహం కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కెసిఆర్ తీసుకొచ్చిన పథకాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల్ వెంకటేష్ వంటి యువ నేతలు, సామాజిక సేవకుడు పాపిశెట్టి రాము వంటి వ్యక్తులు పార్టీకి వెన్నెముకగా నిలిచారు. వీరి వ్యక్తిగత ఇమేజ్, సేవా కార్యక్రమాలు పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించాయి.
బీజేపీ కంచుకోట పటిష్టం....
బీజేపీ అగ్రనేత టి.ఆచారి ఆమనగల్లుకు చెందినవారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. 2020లో ఇక్కడ చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్న బీజేపీకి ఆమనగల్లు స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది. హిందూత్వ, మోదీ ఫ్యాక్టర్ కారణంగా పట్టణ ప్రాంత ఓటర్లు బీజేపీ వైపే మొగ్గు చూపారు. స్థానిక సమస్యలపై బీజేపీ నేతలు నిరంతరం ప్రజల్లో ఉండటం వారికి ఆరు స్థానాలను తెచ్చిపెట్టింది.