24 June, 2026 | 3:38 AM

కోనరావుపేటలో బీఆర్‌ఎస్ ధర్నా

24-06-2026 12:20 AM

వడ్ల కుంభకోణంపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

కోనరావుపేట, జూన్ 23 (విజయక్రాంతి):కోనరావుపేట మండలంలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న వడ్ల కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా నిరసనకారులు వద్దురా నాయన.. కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు.

అనంతరం మాట్లాడిన బీఆర్‌ఎస్ నాయకులు, రైతుల కోసం ఏర్పడిన తెలంగాణలో ప్రస్తుతం రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో సాగు, తాగునీటి సమస్యలు లేకుండా ఉండేవని, యూరియా కొరత కూడా ఉండేదికాదని పేర్కొన్నారు. ప్రస్తుతం రైతులు యూరియా కోసం క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, పంటల సాగుకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందడం లేదని విమర్శించారు.

కోనరావుపేట మండలంలో జరిగిన వడ్ల కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తుల ప్రమేయం ఉందని ఆరోపిస్తూ, అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు నష్ట పోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని కోరారు.రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు చేసిన న్యాయం ఏమిటో వివరించాలని, కోనరావుపేట వడ్ల కుంభకోణంపై పారదర్శక విచారణ చేపట్టి నిజాలను ప్రజలకు వెల్లడించాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, రైతులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.