నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి
కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు
మానకొండూరు,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జి.వి. రామకృష్ణారావును శనివారం తెల్లవారు జామున మానకొండూర్‌లోని ఆయన నివాసంలో మానకొండూరు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి నుంచే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అదుపులోకి తీసుకోవడం ఆ ప్రజాస్వామ్యక చర్య అని, ఈ అరెస్టులను ఖండిస్తున్నామని రామకృష్ణ రావు చెప్పారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కలిసి కుమ్మక్కై బీఆర్ఎస్‌ను అణచివేయడానికి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని అనటానికి ఈ ఘటన నిలువెత్తు సాక్ష్యం అని ఆయన ధ్వజమెత్తారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష స్వరాలను అణిచివేయాలనే ఉద్దేశంతోనే ఈ అక్రమ అరెస్టులు చేపట్టారని మండిపడ్డారు. శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్న నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు .ప్రభుత్వం వెంటనే నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలికి అక్రమంగా అదుపులోకి తీసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని రామకృష్ణారావు డిమాండ్ చేశారు.






