కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట
చనిపోయే వాళ్లను బ్రతికిస్తా... చంపడం నా సంస్కృతి కాదు
నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
బాన్సువాడ, ఆగస్టు 30 (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మీనా గార్డెన్ లో నిర్వహించిన సమారభేరి సన్నాహక సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రత్యర్థులు తనపై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, “చనిపోయే వాళ్లను బ్రతికిస్తా.. చంపడం నా సంస్కృతి కాదు” అని అన్నారు.
వర్ణి, కోటగిరిలో చోటుచేసుకున్న ఘటనల విషయంలో తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.బాన్సువాడ అభివృద్ధిపై మాట్లాడిన బాజిరెడ్డి.. తన హయాంలోనే బాన్సువాడ–నిజామాబాద్ డబుల్ రోడ్డు, నిజాంసాగర్ కెనాల్ లైనింగ్ తదితర అభివృద్ధి పనులు జరిగాయని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే వాటితో పనులు పూర్తి చేసి, ప్రస్తుతం వాటి ఘనతను కాంగ్రెస్ నాయకులు తమ ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. “దమ్ముంటే నిధులు తీసుకురండి.. అభివృద్ధి చేసి చూపించండి” అంటూ సవాల్ విసిరారు.బీఆర్ఎస్ కార్యకర్తలు ఎలాంటి బెదిరింపులకు భయపడవద్దని ఆయన సూచించారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో బాన్సువాడలో బీఆర్ఎస్ జెండా మళ్లీ ఎగరాలని ఆకాంక్షించారు.
కార్యకర్తలు ఐక్యంగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జుబేర్ అంజిరెడ్డి, మోరీల్ శ్రీనివాస్,మాజీ ఎంపీపీ కోటగిరి శ్రీనివాస్, కిషన్, బీర్కూర్ సర్పంచ్ ధర్మతేజ, చందూర్ సర్పంచ్ మాధవరెడ్డి, సాయిబాబా, మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీను,మోచి గణేష్,శివసూరి,రమేష్,సద్దాం, నర్సింలు గౌడ్, అక్బర్, కృష్ణ మహేష్ ఇషాక్ దాసు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 1 నుంచి వరుస నిరసనలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరుస నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బాజిరెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్‌షీట్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. అనంతరం,సెప్టెంబర్ 2 నుంచి వివిధ అంశాలపై నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
సెప్టెంబర్ 2న నియోజకవర్గ కేంద్రాల్లో ఆరు గ్యారెంటీల వైఫల్యంపై ధర్నాలు, ఇంటింటికీ ‘బాకీ కార్డుల’ పంపిణీ చేపట్టనున్నారు,సెప్టెంబర్ 3న రైతు సమస్యలు, సాగునీరు, విద్యుత్, వ్యవసాయ రంగ సమస్యలపై రైతు సదస్సులు, దీక్షలు నిర్వహించనున్నారు,సెప్టెంబర్ 4న మహిళలకు ఇచ్చిన హామీల అమలుపై మహిళా గర్జన, వంటావార్పు కార్యక్రమాలు,సెప్టెంబర్ 5న ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్ కోసం విద్యార్థి, యువజన ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు,సెప్టెంబర్ 6న ప్రత్యేక సదస్సులు, నిరసన ర్యాలీలు,సెప్టెంబర్ 7న ప్రజావాణి కేంద్రాల్లో వినతిపత్రాల సమర్పణ,సెప్టెంబర్ 8న జిల్లా కేంద్రాల్లో ప్రెస్‌మీట్లు,అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాల అందజేత వంటి కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.






