ప్రైవేట్‌కు అమ్మొద్దు.. మార్కెట్ ఫెడ్ కేంద్రానికే జొన్నలు తీసుకురండి: చైర్మన్ విశ్వనాథ్ రావు
జైనూర్, మే 18 (విజయకాంతి): జైనూర్ మార్కెట్ కమిటీ పరిధిలోని ఉట్నూర్ మండలం హస్నాపూర్‌లో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్ రావు ప్రారంభించారు. రైతులు తాము పండించిన జొన్నలను ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికే తీసుకురావాలని ఆయన సూచించారు. మార్కెట్ ఫెడ్ ద్వారా క్వింటాలుకు రూ.3,699 మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని చైర్మన్ తెలిపారు.
అనంతరం హస్నాపూర్‌లోని మార్కెట్ కమిటీ గోదాములను ఆయన పరిశీలించారు. గోదాముల నిర్మాణం శిథిలావస్థకు చేరడంతో మరమ్మతుల కోసం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సహకారంతో నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే నిధులు మంజూరు చేస్తే వెంటనే మరమ్మతు పనులు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ సహకార సంఘం వైస్ చైర్మన్ నారాయణతో పాటు స్థానిక నాయకులు, సహకార సంఘ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.






