22 June, 2026 | 4:07 AM

చేవెళ్ల ‘కారు’కు బ్రేకులు!

22-06-2026 12:33 AM
  1. లీడర్ల ‘సైలెంట్’ రాజకీయం, కార్యకర్తల ‘వైలెంట్’ ఆవేదన
  2. పత్తాలేని జిల్లా ప్రెసిడెంట్ 
  3. పక్క నియోజకవర్గాలకే పరిమితమైన కిషన్ రెడ్డి
  4. పదవుల కోసం ‘సబితమ్మ’ రీ -ఎంట్రీ
  5. క్షేత్రస్థాయిలో రగులుతున్న తృతీయ శ్రేణి
  6. పార్టీని బతికించాలంటే ‘అవినాష్ రెడ్డి’కే పగ్గాలు 
  7. అధిష్టానం వైపు క్యాడర్ చూపు

రంగారెడ్డి/చేవెళ్ల, జూన్ 21 (విజయక్రాంతి): ఒకప్పుడు అధికార బలంతో, గులాబీ జెండాతో కళకళలాడిన చేవెళ్ల గడ్డపై.. ఇప్పుడు బీ ఆర్ ఎస్ ప్రయాణం చుక్కాని లేని నావలా మారింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన నాటి నుండి ఇక్కడ పార్టీ గ్రాఫ్ పాతాళానికి పడిపోతోంది. క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ, వారిని నడిపించే నాథుడే కరువయ్యాడు. ‘పదవులు మాకు.. పనులు మీకు‘ అన్నట్లుగా ప్రథమ శ్రేణి నాయకులు వ్యవహరిస్తుండటంతో, కట్టర్ కార్యకర్తలు తీవ్ర నిరాశ నిష్పృహల్లో మునిగిపోయారు.

 కమిటీలు లేవు.. క్యాడర్‌కు భరోసా లేదు

ఎన్నికలు ముగిసి రోజులు గడుస్తున్నా.. కనీసం బూత్, గ్రామ, మండల స్థాయి కమిటీలను కూడా వేయకపోవడం స్థానిక నాయకత్వ వైఫల్యానికి అద్దం పడుతోంది. చేవెళ్లకు ఒక స్పష్టమైన ఇన్చార్జిని నియమించడంలో అధిష్టానం చేస్తున్న ఆలస్యం పార్టీకి శాపంగా మారింది. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి కేవలం ఇబ్రహీంపట్నం, మహేశ్వరానికే పరిమితమవడంతో, చేవెళ్ల శ్రేణులు తమను పట్టించుకునేవారే లేరని ఆవేదన చెందుతున్నారు.

పెద్దల ‘ఒంటెద్దు పోకడలు’.. మున్సిపల్ ఎన్నికల్లో దెబ్బ

ఇటీవల మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డిల ప్రెస్ మీట్లలో తృతీయ శ్రేణి నాయకుల అసంతృప్తి బాహాటంగానే బద్దలైంది.ఉద్యమ కాలం నుండి రక్తం చెమటగా మార్చి పార్టీని బతికించాం. కానీ ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోకుండా కొందరు పెద్ద నాయకులు ఒంటెద్దు పోకడలతో వెళ్తున్నారు‘ అని కార్యకర్తలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

ఈ అంతర్గత గ్రూపు రాజకీయాల వల్లే మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ ఘోరంగా దెబ్బతిన్నది. 18 కౌన్సిలర్ స్థానాలు ఉంటే.. కేవలం 4 స్థానాలకే పరిమితం కావడం పార్టీ పతనానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

సబితమ్మ ‘చేవెళ్ల’ ప్రేమ.. జనరల్ సీటు కోసమేనా?

ఇంతకాలం మహేశ్వరంలోనే రాజకీయం నడిపిన సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి హఠాత్తుగా మళ్లీ చేవెళ్ల బాట పట్టడం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. భవిష్యత్తులో చేవెళ్ల శాసనసభ స్థానం ‘జనరల్’ అవుతుందనే ఆశతోనే, ఇక్కడ పట్టు సాధించడానికి వారు మళ్లీ వస్తున్నారని క్యాడర్ గుసగుసలాడుకుంటోంది.

గతంలో బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోని ఉన్నపుడు పట్నం మహేందర్ రెడ్డిఅధికారం ఉన్నంత కాలం పదవులు అనుభవించి.. ఓడిపోగానే కాంగ్రెస్లోకి జంప్ అయ్యాడని పార్టీ కి నమ్మకద్రోహిగా ముద్ర,మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి & కార్తీక్ హేశ్వరం వదిలి.. చేవెళ్ల సీటు జనరల్ అవుతుందని రీ-ఎంట్రీ ప్రయత్నాలు పదవుల కోసమే వస్తున్నారనే అనుమానం...

కార్యకర్తల్లో బలంగా ఉంది. ఇటీవల రాష్ట్రంలో పునర్విభజన లో భాగంగా సీట్లు పెరుగుతాయని... రిజర్వ్ స్థానాలన్నీ జర్నల్  అవుతాయని ప్రచారం ఉపందుకుంది.జడ్పీటీసీ నుంచి పట్నం అవినాష్ రెడ్డి కష్టకాలంలోనూ పార్టీలోనే ఉంటూ.. షాబాద్ మండలం తో పాటు నియోజకవర్గం లో పార్టీ నేతలతో మంచి సంబంధాలు నేర్పుతున్నారని పార్టీ పెద్దలు సైతం అవినాష్ రెడ్డి పై పార్టీని నడిపించగల సత్తా ఉందని భావిస్తున్నారు.

అవినాష్ రెడ్డికే పగ్గాలు...?

అధికారం పోగానే పట్నం మహేందర్ రెడ్డి లాంటి వారు కాంగ్రెస్లోకి జంప్ అయినా.. దివంగత రాజేందర్ రెడ్డి కుమారుడు పట్నం అవినాష్ రెడ్డి మాత్రం పార్టీని నమ్ముకుని క్షేత్రస్థాయిలో పోరాడుతున్నారు. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో షాబాద్ మండలంలో ఒంటిచేత్తో పార్టీని గెలిపించి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేత శభాష్ అనిపించుకున్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో చేవెళ్ల కారుకు సరైన డ్రైవర్ పట్నం అవినాష్ రెడ్డి మాత్రమేనని, ఆయనకే నియోజకవర్గ పూర్తి బాధ్యతలు అప్పగిస్తేనే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని గులాబీ శ్రేణులు ముక్తకంఠంతో చెప్తున్నాయి. మరి అధిష్టానం కార్యకర్తల మనోగతాన్ని గుర్తిస్తుందో లేదో చూడాలి.