బొల్లారాన్ని మోడల్ డివిజన్‌గా తీర్చిదిద్దాలి
ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి
జిన్నారం/అమీన్ పూర్, మే 6 : బొల్లారంను ఆదర్శవంతమైన డివిజన్‌గా తీర్చి దిద్దాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. బుధవారం ఉదయం బొల్లారం డివిజన్లో జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి ఆయన మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ మేరకు స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కాలనీల్లో పర్యటిస్తూ ప్రజల ఇబ్బందులను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు.
లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీ ఓవర్ఫ్లో సమస్యలపై స్థానికులు ఫిర్యాదు చేయగా, వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించా రు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకే మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. బొల్లారం డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజలు సమన్వయంతో ముం దుకు సాగాలన్నారు.
నెలలో ప్రతి వారంలో ఒక్కరోజు మార్నింగ్ వాక్ చేసి, ప్రజల సమస్యలను పరిష్కారిస్తామన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అధికారులు సమస్యల పరిష్కరానికి బాధ్యతగా పని చేయాలన్నారు. మార్నింగ్ వాక్ లో గుర్తించిన సమస్యలు వారంలోగా తగు ప్రతిపాదనలు సిద్ధం చేసి పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ డీసీ ప్రదీప్ పాల్గొన్నారు.






