1 August, 2026 | 1:23 AM

కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ ఎంపీలు

01-08-2026 12:23 AM

మేడ్చల్ అర్బన్ జూలై 31(విజయక్రాంతి): కేంద్ర గ్రామీణాభివృద్ధి,వ్యవసాయ,రైతు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ ను తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్లమెంటు సభ్యులు డికే అరుణ,కొండా విశ్వేశ్వర్ రెడ్డి,మాధవనేని రఘునందన్ రావు,గోడం నగేష్,ధర్మపురి అరవింద్ లు మల్కాజిగిరి బిజెపి ఎంపి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన(PMGSY) కింద తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని గ్రామీణ రహదారుల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు.

అంతేకాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PAMAY)కింద అర్హులైన పేద కుటుంబాలకు అధిక సంఖ్యలో గృహాలను మంజూరు చేయాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు విజ్ఞప్తి చేసినట్లు ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.తెలంగాణ గ్రామీణాభివృద్ధి,మౌలిక సదుపాయాల విస్తరణ,పేదల సొంత ఇంటి కల సాకారం కోసం కేంద్ర ప్రభుత్వం మరింత సహాకారం అందించాలని ఆయన కోరారు.

ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు ఈటల రాజేందర్ వెల్లడించారు.