6 June, 2026 | 3:06 AM

ఏపీలో రాజ్యసభ సీటును వదులుకున్న బీజేపీ

06-06-2026 12:46 AM
  1. నాలుగింటిలో టీడీపీకి మూడు, జనసేనకు ఒకటి
  2. అన్నామలై రాజీనామాతో ఏపీలో బీజేపీపై ప్రభావం

అమరావతి, జూన్ 5: తమిళనాడులో కె అన్నామలై బీజేపీ నుంచి వైదొలగడంతో ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ సీటును వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడు టీడీపీకి, మరోటి జనసేన పార్టీ(జేఎస్పీ)కి కేటాయించనున్నారు. తమిళనాడు బీజేపీలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలు.. పొరుగు రాష్ట్రమైన ఏపీలోని ఎన్డీఏ రాజ్యసభ సీట్ల పంపకంపై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. ఏపీలో ఎన్డీఏ కూటమిలో కుదిరిన ఒప్పందం ప్రకారం..

తనకు వచ్చిన ఒక రాజ్యసభ సీటును బీజేపీ వదులుకుంది . విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పార్టీకి రాజీనామా చేసిన తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే అన్నామలైకి ఈ సీటును గతంలో కేటాయించాలని భావించినట్లు తెలిసింది. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ , రాష్ట్ర బీజేపీ నాయకులతో సహా రాబోయే రాజ్యసభ ఎన్నికలు, సీట్ల కేటాయింపుపై గురువారం అమరావతి లో సమావేశమయిన విషయం తెలిసిందే. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం బీజేపీ, జేఎస్పీలకు చెరో సీటు, మిగిలిన రెండు సీట్లను టీడీపీకి కేటాయించాలని నిర్ణయించినట్లు వర్గాలు తెలిపాయి. మారిన పరిస్థితుల నేపథ్యంలో మూడు టీడీపీకి, ఒకటి జేఎస్పీకి కేటాయించనున్నట్లు తెలిసింది.

జనసేన ఎంపీ అభ్యర్థిగా ఎల్ రమేష్

జనసేన రాజ్యసభ(ఎంపీ) అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఎంపికయ్యారు. ఈ మేరకు జెఎస్‌పీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ, పవన్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ వెల్లడించారు. ఎల్ రమేష్‌కు 2015 నుంచి జనసేనతో అనుబంధం ఉంది. శనివారం మధ్యాహ్నం రమేష్ నామినేషన్ వేస్తారని హరిప్రసాద్ పేర్కొన్నారు.