విభిన్న బోధనల భవాణి
నాకు అవార్డు వస్తుందని అనుకోలేదు ఈ సందర్భంగా ‘విజయక్రాంతి’ ప్రతినిధి జాతీయ అవార్డుకు ఎంపికైన ఉపాధ్యాయురాలు బొంపల్లి భవానిని కలిసి మాట్లాడింది. నేను నా స్వార్థం కోసం కాకుండా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్య బోధన చేశాను. నాకు జాతీయ అవార్డు వస్తుందని కలలో కూడా అనుకోలేదు.
బొంపల్లి భవాని, ఉపాధ్యాయురాలు
- ప్రభుత్వ బడిలో వినూత్నంగా పాఠాలు
- ఉపాధ్యాయురాలికి జాతీయ అవార్డు
- రాష్ట్రంలోనే ఎంపికైన ఏకైక టీచరమ్మ
కామారెడ్డి, ఆగస్టు 22 (విజయక్రాంతి): ప్రభుత్వ బడిలో పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించిన ఓ టీచరమ్మకు జాతీయ అవార్డు వరించింది. మారుమూల మండలం కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యాబోధన చేస్తున్న భూంపల్లి భవానికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం వారం రోజుల పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులకు విద్య బోధన పట్ల మెలకువలు నేర్పిస్తోంది. విద్యార్థులకు చక్కని విద్యాబోధన అందించాలని చెప్తుంది.
ఆ శిక్షణలో నేర్చుకున్న విద్యతో పాటు విద్యార్థులకు ఏ రకంగా బోధిస్తే అర్థమవుతుందని, నూతన రీతిలో విద్యాబోధనకు శ్రీకారం చుట్టారు భూంపల్లి భవాని. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ప్రతి ఒక్కరికీ నేడు మొబైల్ ఫోన్లు ఉన్నాయి. దీంతో ఆ విధంగా విద్యా బోధన చేస్తే విద్యార్థులు ఇంటికి వెళ్లి, తల్లిదండ్రుల వద్ద ఫోన్లలో చూసి, నేర్చుకుంటారని నమ్మింది. దీంతో తాను చెప్పిన పాఠాలను వీడియో తీసి, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. ఇలా విద్య బోధనకు బొంపల్లి భవాని శ్రీకారం చుట్టారు.
విద్యార్థులు కూడా చదువుల్లో రాణించారు. దీంతో మారుమూల మండలమైన గాంధారి ప్రాథమిక పాఠశాలలో బోధకురాలుగా కొనసాగుతున్న బొంపల్లి భవాని జాతీయ అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డుకు ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంపికైన ఏకైక ఉపాధ్యాయులు ఈమే కావడం గమనార్హం. 2026 సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జాతీయ అవార్డు ను అందుకోనున్నారు.






