తమిళంలో ఇంకోటి
కొందరు హీరోయిన్లు ఓవర్ నైట్‌లో క్రేజీ భామలుగా మారిపోతుంటారు. మరికొందరు అందం, అభినయంతో ఎంతగా ఆకట్టుకుంటున్నా అదృ ష్టం కలిసిరాదు. మరాఠా ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సేదీ ఇప్పుడు అదే పరిస్థితి. ఈ బ్యూటీ వరుసగా అవకాశాలు వస్తున్నా.. ఆమె ఖాతాలో హిట్ నమోదు కావటంలేదు. భాగ్యశ్రీ ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో నాలుగు సినిమాలు చేసింది.
తెలుగు సినిమాలేవీ కమర్షియల్ సక్సెస్ ఇవ్వలేదు. అయినా భాగ్యశ్రీకి అవకాశాలేమీ ఆగిపోలేదు. ఇప్పుడు ఈ భామ ‘లెనిన్’లో నటిస్తుండగా, మరో సినిమాకూడా తన పేరును పరిశీలిస్తున్నారు. ఇక తమిళంలో ‘కాంత’ చిత్రంలో నటించిన తర్వాత భాగ్యకు అక్కడ పెద్దగా అవకాశాలే రాలేదు. తాజా గా భాగ్యశ్రీకి అక్కడా మరో ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది.
అది కూడా శివ కార్తికేయన్ లాంటి స్టార్ హీరో సరసన భాగ్యశ్రీని కథానాయికగా నటించే అవకాశం రావటం విశేషం. ‘అమరన్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కమల్ హాసన్ నిర్మాణ సారథ్యంలో శివకార్తికేయన్ ‘సెయాన్’ సినిమా చేస్తున్నారు. శివకుమార్ మురుగేశన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ నటించనున్నట్టు గతంలో వార్తలు వచ్చినా టీమ్ అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న భాగ్యశ్రీ ‘సెయాన్’ గురించి ప్రస్తావిస్తూ తాను ఈ సినిమాలో భాగమైన విషయాన్ని ఖరా రు చేసింది.
‘ఈ సినిమాలో నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. నాలోని ఉత్తమ నటిని బయటకు తీసేందుకు ఆస్కారం కల్పించిన పాత్ర ఇది’ అని తెలిపింది. భాగ్యశ్రీ ఇంకా మాట్లాడుతూ.. ‘సినిమాల్లో నటించేటప్పుడు నటీనటులు.. ప్రేక్షకులకు నిజాయితీకి దగ్గరగా కనిపించాలి. ఇందు కోసం ఏ భాషలో నటిస్తే, ఆ భాషను నేర్చుకోవాలి. గతంలో నేను ‘కింగ్‌డమ్’ సినిమాలో నటించినప్పుడు తెలుగులో పట్టు సాధించేందుకు నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకున్నా. ఇప్పుడు ‘సెయాన్’ కోసం తమిళం నేర్చుకుంటున్నా” అని చెప్పుకొచ్చింది.






