డిసెంబరు నాటికి వంద పడకల ఆసుపత్రి పూర్తి
జిల్లా కలెక్టర్ అంకిత్
ఇల్లెందు, ఆగస్టు 14 (విజయక్రాంతి): ఇల్లందులో రూ.37.50 కోట్లతో నిర్మిస్తు న్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను డిసెంబరు నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆసుపత్రి నిర్మాణ పనులు, ఇల్లందు చెరువు, సుదిమళ్ల టీజీడబ్ల్యూఆర్‌ఎస్ పాఠశాల, కళాశాలను ఆయన పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలని, పనుల్లో వేగం పెంచాలని సూచించారు. చెరువులోని నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ పొదుపు గా వినియోగించాలని ఆదేశించారు.
రైతులు వరి సాగును తగ్గించి పెసర వంటి తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను చేపట్టేలా అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. సుందిమళ్ల పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్.. ఈ ఏడాది కూడా పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఖాసీం, ఎంపీడీవో ధన్సింగ్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






