జింబాబ్వేతో జాగ్రత్త
టీ20 ఫార్మాట్‌లో ఏ జట్టునూ తేలిగ్గా తీసుకోలేం. పసికూనల చేతిలో పెద్ద జట్లు భంగపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇటీవల ఐర్లాండ్ చేతిలో భారత్ ఓటమి ఇలాంటిదే. ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్ టీమిండియా జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. ఆ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేసినా మూల్యం చెల్లించుకోక తప్పదు. వరల్డ్‌కప్‌లో పెద్ద జట్లను కంగారెత్తించిన జింబాబ్వేపై భారత్ అత్యుత్తమ ఆటతీరు కనబరిచకుంటే మాత్రం ఇబ్బందే.
- టీమిండియాకు మరో సవాల్
- ఇటీవల ఐర్లాండ్ చేతిలో భంగపాటు
- శ్రేయాస్ కెప్టెన్సీకి అగ్నిపరీక్ష
- యువ ఆటగాళ్లు రాణిస్తారా ?
హరారే, జూలై 21: భారత క్రికెట్ జట్టు యూకే టూర్ ఘోరపరాజయాలతో ముగిసింది. భారీ అంచనాలతో అక్కడకు వెళ్లిన టీమిండియా పూర్తిగా నిరాశపరిచింది. మొదట పసికూన ఐర్లాండ్ చేతిలో వైట్‌వాష్ పరాభ వం చవిచూసింది. ఐర్లాండ్‌పై భారత జట్టు నుంచి ఇలాంటి ప్రదర్శన ఎవ్వరూ ఊహించలేదు. తర్వాత ఇంగ్లాండ్ గడ్డపైనా అదే చెత్త ఆటతీరు. ఫలితంగా టీ20 సిరీస్‌లో 0-- ఘోరపరాభవం. పొట్టి క్రికెట్‌లో ప్రపంచ ఛాంపియన్లుగా ఉన్న భారత జట్టు ఇలా వరుసగా రెండు సిరీస్‌లలో వైట్‌వాష్ అవమానం ఎదుర్కొంటుందని ఎవ్వరూ అనుకోలేదు.పోనీ వన్డే సిరీస్‌లోనైనా గాడిన పడతారా అంటే అదీ జరగలేదు.
తొలి వన్డే గెలిచి సిరీస్‌పై ఆశలు రేకెత్తించిన టీమిండియా తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయి సిరీస్‌ను సమర్పించుకుంది. ఫలితంగా యూకే టూర్‌లో 10 మ్యాచ్‌లకుగానూ కేవలం ఒకే ఒక్క విజయాన్ని అందుకుని చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. ఈ టూర్ ముగిసిన నాలుగు రోజుల్లోనే భారత జట్టు జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు రెడీ అయింది.స్వదేశం నుంచి పలువురు యువ ఆటగాళ్లు తాత్కాలిక కోచ్ లక్ష్మణ్‌తో కలిసి జింబాబ్వేలో ల్యాండ్ అయ్యారు.
అటు వన్డే జట్టులో ఉన్న కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ వంటి ప్లేయర్స్ లండన్ నుంచి నేరుగా హరారేకు బయలుదేరారు. నిజం చెప్పాలంటే ఈ సిరీస్ కెప్టెన్‌గా శ్రేయాస్‌కు అగ్నిపరీక్ష కానుంది. జింబాబ్వేను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఇటీవలే బంగ్లాదేశ్‌ను ఓడించిన ఆ జట్టు స్వదేశంలో బలమైనదే. పైగా టీ20 ఫార్మాట్‌లో ఏ జట్టునూ తక్కువ అంచనా వేయలేం. ఈ విషయం ఇటీవలే ఐర్లాండ్ జట్టు కూడా క్రికెట్ ప్రపంచానికి రుజువు చేసింది.
ఈ నేపథ్యంలో జింబాబ్వేతో టీ20 సిరీస్ హోరాహోరీగా సాగుతుందని అంచనా. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా లాంటి అగ్రశ్రేణి జట్టును ఓడించిన ఘనత జింబాబ్వే సొంతం. ముఖ్యంగా ఆ జట్టుకు కెప్టెన్ సికందర్ రజా అతిపెద్ద బలం. అతడు బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ టీమ్‌ను ముందుండి నడిపించగలడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా లీగ్ క్రికెట్ ఆడిన అనుభవం అతడికి ఉంది. అందుకే సికిందర్ రజాను త్వరగా ఔట్ చేయకుంటే మాత్రం ముప్పు తప్పదు. ఒంటో చేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. బంతితో కూడా మ్యాజిక్ చేయగలడు. అతడి ఆఫ్ స్పిన్‌ను భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఎదుర్కొవాలి.
ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఆడితే వికెట్ సమర్పించుకోక తప్పదు.మరోవైపు యువ ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ కూడా ప్రమాదమే. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాపై బెన్నెట్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. బెన్నెట్తో పాటు బెన్ కుర్రాన్ రూపంలో మరో అద్భుతమైన ఓపెనర్ జింబాబ్వేకు బలం. మిడిలార్డర్‌లో రియాన్ బర్ల్ వంటి సీనియర్ ఆల్‌రౌండర్ ఉన్నాడు. వీరితో పాటు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ బ్రాడ్ ఎవాన్స్ బ్యాట్‌తో కూడా మెరుపులు మెరిపించగలడు. బౌలింగ్లో రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ వంటి పేసర్లు జింబాబ్వేకు కీలకంగా చెప్పొచ్చు.
కాగా రెగ్యులర్ కోచ్ గౌతమ్ గంభీర్ అందుబాటులో లేకపోవడంతో,వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. జట్టును నడిపించనున్నారు. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ, ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా పలువురు కొత్త ప్లేయర్స్‌కు ఈ సిరీస్‌లో చోటు దక్కింది. అటు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్, తన సారథ్యంలో తొలి సిరీస్ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్ టూర్‌లో నిరాశపరిచిన వైభవ్ సూర్యవంశీ ఎలా రాణిస్తాడనేది చూడాలి. అలాగే హర్ష్ దూబే, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, ప్రభ్సిమ్రన్ సింగ్ లాంటి ప్లేయర్స్ అంతర్జాతీయ స్థాయిలో ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది.






