calender_icon.png 21 February, 2026 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయకుంటే.. ఎన్నికలు జరుగనియ్యం

21-02-2026 01:10:20 AM

కరీంనగర్‌లో బీసీ సంఘాల కలెక్టరేట్ ముట్టడి

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్

కరీంనగర్ క్రైం, ఫిబ్రవరి20(విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా కరీంనగర్లో బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం చేపట్టగా, కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా భారీగా బీసీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆది మల్లేశం పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా అమలుపై స్పష్టమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇది బీసీ సమాజంపై జరిగిన రాజకీయ మోసమని ఆరోపించారు.

గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చి, అమలు చేయకుండానే ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కూడా 42 శాతం రిజర్వేషన్ లేకుండానే నిర్వహించేందుకు ప్రయత్నించడం బీసీ సమాజాన్ని రాజకీయంగా దెబ్బతీయడమేనని మండిపడ్డారు. తెలంగాణ జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకుండా ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కడమేనని నాయకులు పేర్కొన్నారు. బీసీలను ఓటు బ్యాంక్గా మాత్రమే చూసే రాజకీయాన్ని ఇకపై సహించమని 42 శాతం రిజర్వేషన్ మా హక్కుఅని స్పష్టం చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ను చట్టబద్ధంగా అమలు చేసి, ఆ తరువాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ లక్మి కిరణ్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పయ్యావుల మహేష్, లింగంపల్లి శ్రీనివాస్, ఉమామహేశ్వర్, గున్నాల కన్నంబా, నల్లగొని శ్రీనివాస్, బెల్లం నరేందర్, మహమ్మద్ అంజాద్, నరాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.