14 March, 2026 | 4:12 PM

తుంగతుర్తి ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసులు పెట్టాలి: బండి సంజయ్ డిమాండ్

14-03-2026 12:08 PM

హైదరాబాద్: కొండగట్టు ఆలయాన్ని ప్రభుత్వాలు పట్టించుకోలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay) ఆరోపించారు. కొండగట్టు పాదయాత్రకు రాజకీయాలతో సంబంధం లేదని వివరించారు. ఏపీలో ఉన్నది ఎన్డీయే భాగస్వామ్య ప్రభుత్వమే అన్న బండి సంజయ్, పవన్ కళ్యాన్ ఎన్డీయే మిత్రుడే అన్నారు. హిందూ దేవుళ్లను అవమానించారన్న ఆరోపణలపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్(Thungathurthy MLA Mandula Samuel)పై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు.

రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించినందుకు గాను, సదరు ఎమ్మెల్యేపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. శనివారం నాడు కొండగట్టు(Anjanna Ashirwadha Yatra) ఆలయానికి తన యాత్రను ప్రారంభించిన సందర్భంగా సంజయ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్‌గా(TPCC SC Cell Chairman) మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ, ఆ కార్యక్రమంలో మందుల సామేల్ హిందూ దేవుళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

వేదికపై ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud), ఇతర కాంగ్రెస్ నాయకులు చప్పట్లు కొడుతూ ఆ వ్యాఖ్యలకు మద్దతు తెలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి, ఆ ఎమ్మెల్యేను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి మందుల సామేల్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని డిమాండ్ చేయడంతో పాటు, వచ్చే ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే భవిష్యత్తుపై హెచ్చరించారు. సంజయ్ కుమార్, కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో కలిసి, కరీంనగర్ నుండి కొండగట్టు వరకు యాత్ర చేపడుతున్నారు.