బాల భరోసా కార్యక్రమం సక్సెస్ చేద్దాం
నిర్మల్,(విజయక్రాంతి): శారీరక ఎదుగుదల ఉన్న చిన్నారుల అనారోగ్య సమస్యల పరిష్కారం కోసం బాల భరోసా కార్యక్రమం ఎంతో మేలు చేస్తుందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో, "ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బాల భరోసా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎదుగుదల నెమ్మదిగా ఉన్న చిన్నారుల ఆరోగ్య ఉన్నతికి బాల భరోసా కార్యక్రమం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ బాల భరోసా కార్యక్రమంలో భాగంగా అంగన్వాడిలలో చేరిన విద్యార్థుల్లో ఎదుగుదల లోపాలు గుర్తించిన వారిని బాల భరోసా కేంద్రాల్లో చేర్పించడం జరుగుతుందని చెప్పారు.
ఇక్కడ వారికి అవసరమైన ప్రత్యేక వైద్య సేవలు అందించడం ద్వారా వారికి స్వాంతన కలుగుతుందన్నారు. అలాగే, ఒకవేళ ప్రత్యేక ఉత్తమ వైద్య సేవలు అవసరమైతే వారికి, పై ఆసుపత్రులలో వైద్య సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. చిన్నారుల్లో అనారోగ్య సమస్యలు, ఎదుగుదల లోపాలు తొందరగా గుర్తించగలిగితే త్వరితగతిన ఆరోగ్యవంతులుగా అవ్వగలుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్, సంక్షేమ అధికారి వినూత్న, ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, ఆర్ఎంఓ రమేష్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






