యాదవ సంఘం భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి
మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్‌కు వినతిపత్రం అందజేత
రామగిరి,(విజయక్రాంతి): రామగిరి మండలంలోని రత్నాపూర్ మేడిపల్లి శివారులో యాదవ సంఘానికి కేటాయించిన 5 ఎకరాల భూమికి సంబంధించిన నిధులను (డబ్బులను) మంజూరు చేయించి, యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించాలని కోరుతూ యాదవ సంఘం నాయకులు మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా యాదవ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ... రత్నాపూర్ మేడిపల్లి పరిధిలో యాదవ సంఘం కోసం 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారని, అయితే దానికి సంబంధించిన నిధులు అందకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. యాదవుల సంక్షేమం, ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం నుండి తగిన నిధులు ఇప్పించేలా చొరవ చూపాలని వారు కోరారు.
వినతిపత్రం స్వీకరించిన తొట్ల తిరుపతి యాదవ్ సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ల్యాండ్ నిధులు త్వరగా విడుదలయ్యేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






