4 April, 2026 | 5:05 AM

విష సర్పాలతో బహుపరాక్

04-04-2026 12:00 AM

ఘట్ కేసర్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి) : ప్రస్తుత వేసవిలో నగర శివారు ప్రాంత ప్రజలకు విష సర్పాలతో ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రజలు ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో పాములు దరిచేరి కాటేస్తుండటం జరుగుతుంటాయి. అంతేకాకుండా వేసవిలో అకాల వర్షాలకు రాత్రి వేళల్లో పాముల సంచారం అధికంగా ఉంటుంది. పాముల్లోని విషం రెండు రకాలుగా పనిచేస్తుంది.

ఒకటి రక్తనాడులపై ప్రభావం చూపేదికాగా, మరొకటి నరాలపై ప్రభావం చూపుతుంది. వేసవి కాలంలో మనుషులకు పాముకాటు వల్ల ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆరుబయట నిద్రించడం ఒక కారణమైతే అకాల వర్షాలకు రాత్రివేళల్లో చల్లదనం ఏర్పడి పాములు బయటికి రావడంతో మానవునికి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఇళ్లల్లోకి ప్రవేశించిన పాములు చల్లటి ప్రదేశాల్లో మాటువేసి కాటువేసే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి.

ప్రమాదవశాత్తు పాముకాటు వేసిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలకు వైద్యులు కొన్ని సలహాలు అందజేస్తున్నారు. ముఖ్యంగా విషరహిత పాములే అధికంగా ఉంటాయని చెపుతున్నారు. కాటుకు గురైన వ్యక్తిని నెమ్మదిగా పడుకోబెట్టాలి. ఎక్కువగా గాబర పెట్టడటం వల్ల విషం త్వరగా వ్యాప్తిచెందే ప్రమాదం ఉంటుంది. కాటుకు గురైన వ్యక్తికి 70 శాతం పాములు విషరహిత మైనవేనని తెలపాలి.

30 శాతంలో సగం మాత్రమే మనిషి శరీరంలోకి విషాన్ని పంపే పాములు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. చేయి లేదా కాలిపై పాముకాటు జరిగినపుడు సాధ్యమైనంత వరకు అవయవాలను కదిలించకుండా జాగ్రత్త పడాలి. చిన్నగుడ్డతో ఒత్తిడి అధికంగా లేకుండా కట్టుకట్టాలి. పాముకాటుకు గురైన వ్యక్తిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సమయం వృదా చేయరాదు. ఆసుపత్రులలో చేరిన అనంతరం ప్రయాణ సమయంలో బాధితుడు ఎలా ప్రవర్తించాడనే విషయాన్ని వైద్యులకు తెలపాలి.

కాటేసిన పామును గుర్తించి వైద్యులకు తెలపడం వల్ల సరైన మందులు అందజేసి ప్రాణాపాయం నుంచి తప్పించగలుగుతారు. పాము కాటేసినపుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నాటువైద్యం జోలికి వెళ్లి సమయాన్ని వృధా చేసుకోరాదని వైధ్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాముకాటుకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని వైద్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా రైతులు రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లినపుడు జాగ్రత్తగా మెలగడం ఎంతైనా మంచిది.