21 August, 2026 | 1:42 AM

‘ఇరుముడి’కి స్వయంగా డబ్బింగ్ చెప్పా!

21-08-2026 12:00 AM

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘ఇరుముడి’. ఇందులో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన బేబీ నక్షత్ర విలేకరులతో ప్రత్యేకంగా సమావేశమై సినిమా విశేషాలు పంచుకుంది. 

-నా పేరు నక్షత్ర. మాది కేరళ. నేను ఏడో క్లాస్ చదువుకుంటున్నా. ఇప్పటివరకు కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో కలిపి ఆరు సినిమాలు చేశా. చిన్న వయసులోనే పృథ్వీరాజ్, శివరాజ్‌కుమార్, రవితేజ లాంటి పెద్ద హీరోలతో పనిచేసే అవకాశం దక్కడం -చాలా హ్యాపీగా ఉంది. ఇందుకు మా అమ్మకు థాంక్స్ చెప్పుకుంటా. తనే నన్ను చాలా ప్రోత్సహిస్తుంది. నా చదువును, సినిమాలను బ్యాలెన్స్ చేయడంలో -ముఖ్యంగా మా టీచర్స్ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మా పేరెంట్స్, టీచర్స్ సపోర్ట్ వల్లే నేను సినిమాలు చేయగలుగుతున్నా. 

-‘ఇరుముడి’ నా తొలి తెలుగు సినిమా కావడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు శివ నిర్వాణ ఇన్‌స్టాలో నా రీల్స్ చూసి నన్ను ఎంపిక చేశారు. దర్శకుడు శివ నిర్వాణ సపోర్ట్‌తోనే నేను ఈ సినిమాను చాలా కాన్ఫిడెన్స్‌గా చేయగలిగా. 

రవితేజతో కలిసి పనిచేయడం -చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. రవితేజ సినిమాల్లో నాకు ‘విక్రమార్కుడు’ చాలా ఇష్టం. 

ఈ చిత్రంలో నా పాత్ర పేరు మణికంఠ. నేను రవితేజ కూతురిగా కనిపించబోతున్నా. ప్రియా భవానీ శంకర్ నా తల్లి పాత్రలో నటిస్తున్నారు. రవితేజ, ప్రియా మేడమ్ ఇద్దరూ నాతో ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారు. ఈ సినిమాకు స్వయంగా డబ్బింగ్ చెప్పా. ‘ఇరుముడి’లో పాటలన్నీ నాకు ఇష్టం. ‘యాలో యాలో..’ నా ఫేవరెట్. 

ఈ సినిమాను సీలేరులో షూట్ చేశాం. అక్కడి ప్రదేశాలు నాకు కేరళలాగే అనిపించాయి. మైత్రి మూవీ మేకర్స్ పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా.