ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పోరు తప్పదు
15 రోజుల్లో బకాయిలు విడుదల చేయాలి
మూడేళ్ల నుంచి విడుదల చేయని కాంగ్రెస్ ప్రభుత్వం
బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి
హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కలిసి రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ విద్యాసంస్థలను సందర్శించి పోరు కొనసాగిస్తామని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి హెచ్చరించారు.
శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డితో కలిసి రమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. అంతేకాకుండా విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తామని, ఈ అంశాన్ని ఉద్యమంగా తీసుకెళ్తామని ఆయన హెచ్చరించారు. రాబోయే 10- రోజుల్లో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు.
విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దన్నారు. అధికారంలోకొచ్చి రెండున్నరేళ్లు దాటినా, గత ప్రభుత్వానికి సంబంధించిన రెండు సంవత్సరాల బకాయిలు, ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన మూడు సంవత్సరాల బకాయిలు కలిపి 2022 2023 2024- 2025 విద్యా సంవత్సరాలకు చెల్లించాల్సిన సుమారు రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కాలేదని తెలిపారు.
లక్షలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్‌గౌడ్ పాల్గొన్నారు.






