26 June, 2026 | 4:11 PM

డ్రగ్స్ కు దూరంగా ఉండాలి

26-06-2026 02:55 PM

- ఇన్‌స్పెక్టర్ దుర్గ

సిద్దిపేట క్రైం: యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ దుర్గ హితవు పలికారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం సిద్దిపేటలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్ దుర్గ మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, వాటి నివారణోపాయాల గురించి విద్యార్థులకు వివరించారు.

క్షణికానందం కోసం వ్యసనాలకు అలవాటు పడితే శారీరక, మానసిక అనారోగ్యంతోపాటు కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. అనంతరం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు తమ వంతు కృషి చేస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.