26 June, 2026 | 4:34 PM

అమరుల ఆశయ సాధనకే నిజమైన నివాళి: బండి రమేష్

26-06-2026 03:41 PM

ఖమ్మం రూరల్,(విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజలను ఐక్యం చేసి ఉద్యమాలు నిర్వహించడమే అమరులకు అర్పించే నిజమైన నివాళి అని సీపీఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్ అన్నారు. ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామంలో వీర తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట యోధుడు గుర్రం సూరయ్య, సీపీఎం సీనియర్ నాయకుడు, మాజీ గ్రామ శాఖ కార్యదర్శి, సీఐటీయూ జిల్లా స్థాయిలో సేవలందించిన గుర్రం వెంకటనారాయణ ఐదో వర్ధంతి సభ శుక్రవారం నిర్వహించారు. పార్టీ పాలేరు డివిజన్ కమిటీ సభ్యుడు పెరుమాళ్లపల్లి మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బండి రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా తీసుకొస్తున్న విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి ప్రయత్నించడం సరికాదన్నారు.

విద్యుత్ రంగ ప్రైవేటీకరణ, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పులు, కార్మిక హక్కులను బలహీనపరిచే నాలుగు లేబర్ కోడ్‌లను వ్యతిరేకిస్తూ ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మికులకు మేలు చేసే 44 కార్మిక చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు అమరవీరుల చిత్రపటాలకు బండి రమేష్, నండ్రా ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ పతాకాన్ని సీనియర్ నాయకుడు తమ్మినేని వీరభద్రయ్య ఆవిష్కరించారు.