26 June, 2026 | 5:19 PM

రజక ఫెడరేషన్‌కు రూ. 9 వేల కోట్లు కేటాయించాలి

26-06-2026 04:03 PM

- చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు చాకలి శ్రీలక్ష్మి

మంచిర్యాల క్రైమ్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రజకుల సంక్షేమంపై దృష్టి సారించి రజక ఫెడరేషన్‌కు రూ. 9 వేల కోట్లు కేటాయించి వారి అభ్యున్నతికి కృషి చేయాలని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు చాకలి శ్రీలక్ష్మి డిమాండ్ చేశారు. శుక్ర వారం మంచిర్యాల పట్టణంలోని రజక సంఘ భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలని కోరారు. ఎన్నికలకు ముందు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రస్తావించారని గుర్తు చేశారు.

వృత్తి నిర్వహణలో చెరువులు, ఇతర నీటి వనరుల్లో ప్రమాదాలకు గురై మృతి చెందిన రజకులకు కార్మిక చట్టం వర్తింపజేసి రూ. 5 లక్షల బీమా అందించాలని, చాకలి ఐలమ్మ పేరును జనగామ జిల్లాకు నామకరణం చేయడంతో పాటు ట్యాంక్‌బండ్‌పై ఆమె విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. జూలై 6న హైదరాబాద్‌లో జరిగే చాకలి ఎస్సీ సాధన సమితి 9వ వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేయాలని, ఈ మహాసభకు బీహార్ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే శ్యామ్ రజక్, తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మాదరపు యాదగిరి తదితర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. హక్కుల సాధన కోసం అన్ని సంఘాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు.