5 August, 2026 | 7:37 PM

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

05-08-2026 06:36 PM

సీఐ సుధీర్ కుమార్

జిన్నారం/అమీన్ పూర్: ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో టీజీ మోడల్ కళాశాలలో సురక్షా తిరంగా సైబర్ క్రైమ్ పై విద్యార్థులకు  అవగాహన ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలు, వాటి నుంచి రక్షణ పొందే మార్గాలపై పోలీసులు అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిస కాకూడదని, అపరిచితులు పంపే ఏపీకే ఫైళ్లు, అనుమానాస్పద లింకులు, క్యూఆర్ కోడ్‌లు క్లిక్ చేయకూడదని సూచించారు. ఇలాంటి చర్యల వల్ల మొబైల్ ఫోన్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని వివరించారు.

అలాగే ఓటిపి, యూపీఐ పిన్, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు ఎవరికీ చెప్పకూడదని, సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని, నకిలీ ఉద్యోగాలు, స్కాలర్‌షిప్‌లు, లాటరీలు, పెట్టుబడులు, గేమింగ్ రివార్డుల పేరుతో జరిగే సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్కు కాల్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో  ఎస్సై అక్షిత, ఎస్సై కిష్టా రెడ్డి పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపాల్  శ్రీదేవి కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు డిజిటల్ సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించి, అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరాలను సమర్థవంతంగా నివారించవచ్చని పోలీసులు తెలిపారు.