15 May, 2026 | 8:38 PM

బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత

15-05-2026 07:29 PM

బాల్య వివాహాలతో జరిగే ఇబ్బందులపై అవగాహన కల్పించాలి

బాల కార్మిక వ్యవస్థ ఉండవద్దు

బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి

ప్రభుత్వ విప్, అది శ్రీనివాస్,జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

సిరిసిల్ల,(విజయక్రాంతి): స్త్రీ, మహిళా, శిశు, వృద్ధుల, దివ్యాంగుల, ట్రాన్స్ జెండర్స్ ల సంక్షేమ శాఖ ఆద్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లో బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా ఈ కార్యక్రమానికి  బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే లు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లల రక్షణ.. సమాజం బాధ్యత టోల్ ఫ్రీ నంబర్లతో రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కిశోర బాలికలకు శిక్షణ ఇచ్చేందుకు కుట్టు మిషన్ అందజేశారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డుల్లో బాలల హక్కుల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని, బాల్య వివాహాలతో కలిగే ఇబ్బందులపై అవగాహన కల్పించాలని, బాల్య వివాహాలు అడ్డుకోవాలని సూచించారు. 

బాల కార్మిక వ్యవస్థ ఉండవద్దని స్పష్టం చేశారు. 1098 హెల్ప్ లైన్ వినియోగించుకోవాలని తెలిపారు.  మగ, ఆడపిల్లల ఇద్దరం సమానమని స్పష్టం చేశారు. స్థానిక సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. బాల బాలికలకు అవగాహన కల్పించాలని, చదువుతోనే   సామాజిక. ఆర్థిక మార్పు సాధ్యమని తెలిపారు.

ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. 18 ఏండ్ల లోపు బాల, బాలికలను కమిటీలు సంరక్షించాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించాలని తెలిపారు. జిల్లాలో 100కు పైగా అంగన్వాడీ ల భవనాలు నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. 

బాలలపై వేధింపులు, బాల్య వివాహాలు నిరోధించాలని ఆదేశించారు. సర్పంచులు అంగన్వాడి కేంద్రాలు, స్కూల్స్ లో సందర్శించాలని సూచించారు. గ్రామ అభివృద్ధి, సంక్షేమంతోపాటు చిన్నారులు హక్కుల రక్షణకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 

విద్యపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, డైట్ చార్జీలు 40 శాతం, కాస్మొటిక్ ఛార్జీలు పెంచిందని, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. ప్రతి గ్రామంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సర్పంచులు, కార్యదర్శులు బాలల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ... చట్ట ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని తెలిపారు. అనాథలకు ప్రభుత్వం  మిషన్ వాత్సల్య కింద ప్రతి నెలా రూ.4000 సహాయం అందిస్తుందని, జిల్లాలో 117 మంది పిల్లలకు ప్రతి నెలా పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ఇంకా ఎవరైనా ఉంటే తమ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో సమాచారం ఇవ్వాలని సూచించారు, ప్రతి వారంలో ఒక రోజు పంచాయతీ కార్యదర్శి పిల్లలతో కలిసి భోజనం చేయాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ బాలల హక్కుల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఎస్పీ మహేష్ బి గితే మాట్లాడుతూ... బాలల హక్కుల పరిరక్షణ కోసం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్మిక శాఖ అధికారులతో కలిసి ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించి.. బాల కార్మికులకు విముక్తి కల్పించామని తెలిపారు. షి టీమ్ లు ఏర్పాటు చేసి.. మహిళల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు స్వరూపారెడ్డి, రాములు నాయక్, రాజు, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, సిరిసిల్ల ఆర్డీఓ రాజేందర్ రెడ్డి, డీఎస్పీ నాగేంద్రచారి తదితరులు పాల్గొన్నారు.