10 August, 2026 | 4:47 PM

పెన్షన్ దరఖాస్తుల సమర్పణకు కాంగ్రెస్ కార్యకర్తల సహకారం

10-08-2026 02:33 PM

బోధన్, ఆగస్టు 10 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలలో ప్రధానమైన ఆసరా పెన్షన్ల మంజూరు కోసం అర్హులైన నిరుపేదలు గత ఐదారు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారని గ్రామ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. గతంలో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ప్రస్తుతం దరఖాస్తు ప్రొఫార్మా మారడంతో ప్రభుత్వం సూచించిన కొత్త నమూనా ఫారంలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది.

ఈ నేపథ్యంలో నిరుపేదలు కొత్త దరఖాస్తు ఫారాలు తీసుకురావడానికి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుకు వచ్చారు. సుందర్ రాజు ఆధ్వర్యంలో సోమవారం రోజున కొత్త దరఖాస్తు ఫారాలను తెచ్చి, లబ్ధిదారులకు అందజేసి, వాటిని పూర్తి చేయడంలో సహకరించారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి దరఖాస్తులను గ్రామపంచాయతీలో సమర్పించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, పెన్షన్‌కు అర్హత ఉన్న ప్రతి నిరుపేదకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం అందేలా తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహకరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుందర్ రాజు, వైట్ల శ్రీనివాసరావు, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు షేక్ మజార్ అలీ, పులి అంజి, గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి యపారు బలరాం, యువ నాయకుడు మల్లవరపు కౌటిల్య, భీమ్ శెట్టి పవన్ తదితరులు పాల్గొన్నారు.