మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాస్తారోకో
కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతున్న మోడీ ప్రభుత్వం
కార్మిక, కర్షక ఐక్యతతో పోరాడుదాం: రేపాకుల శ్రీనివాస్
టేకులపల్లి, (విజయక్రాంతి): కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సోమవారం టేకులపల్లి మండల కేంద్రంలోని బోడు రోడ్డు సెంటర్‌లో సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కుంజ హైమావతి అధ్యక్షతన జరిగిన సభలో రేపాకుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. పరాయి పాలనను అంతమొందించేందుకు గతంలో క్విట్ ఇండియా ఉద్యమం జరిగిందని, అదే స్ఫూర్తితో నేడు కార్మికులు, రైతులు, ప్రజలకు వ్యతిరేకంగా సాగుతున్న మోడీ ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు.
కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా కార్మిక చట్టాలను మార్చిందని ఆరోపించారు. నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు వీలు కల్పించే విదేశీ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, వీబీజీ-రామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలని, నూతన విత్తన, విద్యుత్ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరారు. రైతులు పండించిన పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
కార్మికులు, కర్షకులు ఐక్యంగా ఉద్యమించి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని రేపాకుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు ఈసం నరసింహారావు, కడుదుల వీరన్న, సీఐటీయూ మండల కన్వీనర్ కుంజ హైమావతి, రైతు సంఘం మండల కార్యదర్శి పూనెం స్వామి, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి కుంజ రమేష్, కోయగూడెం వార్డు మెంబర్ పూనెం చంద్రశేఖర్, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు పూనెం శిరోమణి, బి. లక్ష్మి, జి. లక్ష్మి, విద్య, మంగ, చైతన్య, మాధవి, ఈసం రామకృష్ణ, నాగేంద్రబాబు, పూనెం బుచ్చయ్య, ప్రేమ్‌కుమార్, సుదర్శన్, మాడె శేఖర్, చింత రమేష్ తదితరులు పాల్గొన్నారు.






