8 June, 2026 | 9:06 PM

సిరికొండ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్పీ రుత్విక్ సాయి తనిఖీ

08-06-2026 08:17 PM

* రికార్డులు, కేసుల దర్యాప్తులపై ఆరా

సిరికొండ,(విజయక్రాంతి): వార్షిక తనిఖీల్లో భాగంగా ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే సోమవారం సిరికొండ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై విక్రం పూలమొక్క అందజేసి స్వాగతం పలకగా, సిబ్బంది ఏర్పాటు చేసిన గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోని వాహనాల స్థితిగతులు, సిబ్బందికి కేటాయించిన సామగ్రి, సేవా రికార్డులు, స్టేషన్ నిర్వహణను ఏఎస్పీ పరిశీలించారు. అనంతరం సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో పలు సూచనలు చేశారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలని సూచించారు. గంజాయి, గుడుంబా, మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, యువతను వ్యసనాల బారిన పడకుండా చైతన్యపరచాలని పేర్కొన్నారు. ప్రజల్లో పోలీసులపై విశ్వాసం పెంపొందేలా కేసుల దర్యాప్తును పారదర్శకంగా నిర్వహించాలని, స్టేషన్‌లో ఎలాంటి పెండెన్సీ లేకుండా రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు.

ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి వారి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని, సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు. మహిళలపై వేధింపులు, చిన్నారులపై నేరాలు, బాల్య వివాహాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీట్లను తరచూ తనిఖీ చేస్తూ వారి కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ సీఐ సీహెచ్ రమేష్, ఎస్సై విక్రమ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.