నత్తనడకన అశోక్‌నగర్ బ్రిడ్జి పనులు
- ఆరు నెలలు గడిచినా పూర్తికాని వంతెన..
- ప్రయాణికులు, వాహనదారులకు తప్పని నరకయాతన
- అధికారుల పర్యవేక్షణ లోపంతో కాంట్రాక్టర్ల జాప్యం..
- త్వరగా పనులు పూర్తి చేయాలని ప్రజల డిమాండ్
ముషీరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆర్టీసీ క్రాస్రోడ్స్ నుంచి ఇందిరాపార్క్ వైపు వెళ్లే ప్రధాన రహదారిలో చేపట్టిన అశోక్నగర్ బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ నిర్మాణ పనులు ప్రారంభమై సుమారు ఆరు నెలలు గడిచినా ఇప్పటికీ పూర్తికాకపోవడంతో స్థానిక ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కోట్ల రూపాయలతో చేపట్టిన నిర్మాణం
ఆర్టీసీ క్రాస్రోడ్స్‌ఇందిరాపార్క్ మార్గం నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రహదారుల్లో ఒకటి. ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు, కార్లు, ఆటోలు, ఆర్టీసీ బస్సులు ఈ మార్గం మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అశోక్నగర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు కొంతవరకు తగ్గడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం అందుతుందని ప్రజలు ఆశించారు. అయితే నిర్మాణ పనులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా పనులు ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆరు నెలలు గడిచినా పూర్తికాని పనులు
బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తవుతాయని భావించిన ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. ఆరు నెలలు గడిచినా పనులు పూర్తికాకపోవడంతో ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. నిర్మాణ ప్రాంతంలో ట్రాఫిక్ పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనులపై వెళ్లేవారు సైతం ట్రాఫిక్లో చిక్కుకుని సమయం వృథా చేసుకోవాల్సి వస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు.
అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు
నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యానికి అధికారుల పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న ఇలాంటి కీలకమైన ప్రాజెక్టులపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి, కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుని పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు కనిపించడం లేదని వారు అంటున్నారు. కాంట్రాక్టర్ల జాప్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పనుల పురోగతిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించి వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
వాహనదారులకు నరకయాతన
బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా రహదారిపై ఏర్పడుతున్న ఇబ్బందులు ప్రయాణి కులకు నరకయాతనగా మారుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. ముఖ్యంగా కార్యాలయాలు, విద్యాసంస్థలు, వ్యాపార ప్రాంతాల కు వెళ్లే సమయంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటోందని వాహనదారులు వాపోతున్నారు. వృద్ధులు, విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర సేవల కోసం ప్రయాణించే వారు కూడా ఈ మార్గంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు.
పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్
అశోక్నగర్ బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాణ పనుల పురోగతిపై ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి, కాంట్రాక్ట్ప పర్యవేక్షణ పెంచాలని కోరుతున్నారు.
ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా అవసరమైన ప్రత్యామ్నాయ ట్రాఫిక్ ఏర్పాట్లు చేయడంతో పాటు, నిర్మాణ పనులకు స్పష్టమైన గడువు నిర్ణయించి ఆలోగా పూర్తి చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో స్పష్టత ఇవ్వాలి. ప్రజలను నెలల తరబడి ఇబ్బందులకు గురిచేయకుండా పనులను వేగవంతం చేసి, అశోక్నగర్ వాసులు, ప్రయాణికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.






