30 May, 2026 | 2:10 AM

అడ్వకేట్ హత్య కేసులో నిందితుల అరెస్టు

30-05-2026 12:15 AM
  1. పాత గొడవల నేపథ్యంలో ఖాజా మోయిజుద్దీన్ హత్య
  2. కిషన్‌కు సుపారీ ఇచ్చిన ముజాహిద్ ఆలం ఖాన్
  3. పథకం ప్రకారం హత్య చేసిన నిందితులు
  4. కేసును ఛేదించిన పోలీసులను అభినందించిన సీపీ సజ్జనార్

ఖైరతాబాద్, మే 29(విజయక్రాంతి): ఇటీవల మాసబ్ ట్యాంక్ వద్ద జరిగిన అడ్వకేట్ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అతి తక్కువ సమయంలోనే నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.ఈ మేరకు బంజారాహిల్స్ లోని సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో  సిపి సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం మే 23 తెల్లవారుజామున అడ్వకేట్ ఖాజా మోయిజుద్దీన్ స్మిమ్మింగ్ కోసం మాసబ్ ట్యాంక్ లోని తన నివాసం నుంచి బయటకొచ్చారు. కారు ఎక్కే క్రమంలో అతివేగంగా వచ్చిన ఓ వాహనం అతన్ని బలంగా ఢీకొట్టడంతో తన వాహనం నుంచి 10 మీటర్ల దూరంలో పడి తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే ఆయనను చికిత్స నిమిత్సం ఆబిడ్స్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మోయిజుద్దీన్ కుమారుడు ఎం.ఎస్.ఫర్హాన్ ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొదట రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేసినప్పటికీ బాధిత అడ్వకేట్ మరణానంతరం హత్య కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. దర్యాప్తులో భాగంగా సేకరించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. నంబర్ ప్లేట్ లేని పచ్చ రంగు మహీంద్రా స్కార్పియో వాహనం మృతుని ఇంటి వద్దే కాపు కాసి, ఆయన బయటకు రాగానే ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి పారిపోయినట్లు స్పష్టమైంది. సికింద్రాబాద్ లోని పంచవటి లాడ్జ్,  నారాయణగూడలోని మెహఫిల్ హోటల్ వద్ద ఉన్న సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు పేర్కొన్నారు.

అయితే కేసులు ముజాహిద్ ఆళం ఖాన్ ను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు.నిందితుడి కుటుంబానికి, అడ్వకేట్ కుటుంబానికి మధ్య మలక్పేట,లక్డీకాపూల్లోని వక్ఫ్ ఆస్తుల నిర్వహణ విషయంలో పాత గొడవలు ఉన్నట్లు తేలింది.వీరి మధ్య గత కొన్ని ఏళ్లుగా సివిల్, క్రిమినల్, వక్ఫ్ ట్రిబ్యునల్ కేసులు నడుస్తున్నాయని పోలీసులు గుర్తించారు.మోయిజుద్దీన్ చురుగ్గా న్యాయపోరాటం చేస్తూ తమకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చేలా చేస్తున్నాడని, దీనివల్ల తాము అవమానాలు ఎదుర్కొంటున్నామని భావించిన నిందితులు..

ఆయనను హతమార్చాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడైందన్నా రు. ఈ మేరకు ప్రధాన నిందితుడు ఆలం ఖాన్ తన తండ్రి మెహబూబ్ ఆలం ఖాన్ కలిసి హత్యకు ప్రణాళిక రచించారు. అందుకు తమ సన్నిహితులైన హసన్ అలీ, మునీర్ ద్వారా కిషన్ ఆలియాస్ పప్పును సంప్రదించారు.కిషన్ ఈ పని కోసం విన య్, విక్రమ్, అభిజిత్ అనే వ్యక్తులను ఒప్పించాడని విచారణలో తేలినట్లు తెలిపారు. హత్య కోసం స్కార్పియో వాహనం కొనుగోలు చేయడానికి ముజాహిద్ ఆలం ఖాన్ రూ. 2 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చాడన్నారు. జనవరి 2026 నుండి నిందితులు మృతుని ఇంటి వద్ద, అతను తిరిగే ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి, అదను చూసి మే 23న స్కార్పియోతో ఢీకొట్టి హత్య చేశారని తెలియ జేశారు.

హత్య తర్వాత నిందితులు సాక్ష్యాలను చెరిపివేసేందుకు ప్రయత్నించి వివిధ ప్రాంతాలకు పరారయ్యారని వెల్లడించారు. సాంకేతిక కేతిక ఆధారాలతో నిందితుడు కిషన్ ఆలియాస్ పప్పును హర్యానాలోని పానిపట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు.అతని విచారణలో వెల్లడైన వివరాల ఆధారంగా మిగిలిన నిందితులు ముజాహిద్ ఆలం ఖాన్, మెహబూబ్ ఆలం ఖాన్,అభిజిత్ ఆలియాస్ నాని, దిగన్ వినయ్, విక్రమ్ ఆదిత్య, మణిదీప్ ఆలియాస్ పోగో నానిలను అరెస్టు చేయడం జరిగిందన్నారు.

వారి నుంచి హత్యకు ఉపయోగించిన స్కార్పియో వాహనంతో పాటు రూ.10.10 లక్షల నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు.ఈ కేసులో సమర్థవంతంగా పనిచేసిన అబిడ్స్ ఏసీపీ పి. ప్రవీణ్ కుమార్, నాంపల్లి ఇన్స్పెక్టర్ సి.హెచ్ సైదులు, ఎస్‌ఐ ఆదిల్ రియాజ్ ఖాన్, సిబ్బందిని హైదరాబాద్ సిటీ పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని సిపి  తెలిపారు.