1 March, 2026 | 4:57 AM

ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలి

28-02-2026 12:35 AM

అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి 

మేడ్చల్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): జిల్లాలో యాసంగి సీజన్ లో ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం పౌర సరఫరాల డీఎం సుగుణబాయి, పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి చంద్రకళ, డి సి ఓ నాగలింగ చారి, మార్కెటింగ్ శాఖ అధికారి రియాజ్, ధాన్యం సేకరణ కేంద్రాల ఇన్చార్జిలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 15 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అన్నారు. తేమ, తాలు, మట్టి ఉన్న ధాన్యం తీసుకురాకుండా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

ఎంట్రీ ఆపరేటర్ ఎప్పటికప్పుడు సక్రమంగా ఎంట్రీ చేసేలా చర్యలు తీసుకోవాలని, తప్పులున్న, ఎంట్రీలో జాప్యం చేసిన రైతులకు డబ్బుల చెల్లింపు ఆలస్యం అవుతుందన్నారు. వరి కోత మిషన్ యజమానులతో క్రమపద్ధతిలో పంట పొలం కోసేలా మాట్లాడాలని సూచించారు. ధాన్యం విక్రయించిన తర్వాత రైతులకు 48 గంటల్లో డబ్బులు చెల్లించడం జరుగుతుందన్నారు. వివిధ శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని, రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చించుకుని పరిష్కరించాలన్నారు.