మనుబోతులపాడులో ఉద్రిక్తత
పోడు భూముల స్వాధీనం కోసం ఫారెస్ట్ అధికారుల యత్నం
పోడుదారులకు, అధికారులకు మధ్య వాగ్వాదం
ఆదివాసీ మహిళపై ఫారెస్ట్ అధికారుల దాడి
ఆలస్యంగా వెలుగులోకి ఘటన
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 18 (విజయక్రాంతి): భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం మనుబోతులపాడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వలస గిరిజనులు పోడు భూములను సాగు చేసుకుంటున్న క్రమంలో గురువారం పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించగా పోడుదారులకు, అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు మహిళలపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఘర్షణలో పలువురికి గాయాలు అయ్యాయి. పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కపరిచారు. గాయపడిన మహిళలను ఆసు పత్రిలో చేర్పించారు.
దాడికి పాల్పడిన అట వీ శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సుమారు 20 హెక్టార్లలో వలస గిరిజనులు ఎంతో కాలంగా పోడు భూ ములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సాగు చేస్తున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని గత పది సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు మం జూరు చేయకపోవడంతో ఏటా వ్యవసాయ సీజన్ ప్రారంభంలో గిరిజనులకు, అటవీ శాఖ అధికారులకు ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.
అటవీ భూమి పరిరక్షణకు చర్యలు
మణుగూరు రేంజ్, మనుబోతులపాడు సెక్షన్, రెగ్యులగండి-- ఏ బీట్‌లోని కంపార్ట్‌మెంట్ నెం.165లో ప్రభుత్వ రిజర్వు అటవీ భూమి రక్షణ కోసం అటవీ శాఖ సిబ్బంది వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ ప్రకటనలో తెలిపారు. జూన్ 29న సంబంధిత వ్యక్తుల సమక్షంలోనే 20 హెక్టార్ల పని ప్రాంతం సరిహద్దులను గుర్తించినట్లు ఆయన తెలిపారు.
ఈ నెల 2న మొక్కల పెంపకానికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. పనులకు కలుగుతున్న ఆటంకంపై ఈ నెల 10న అశ్వాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. గురువారం అటవీ శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రభుత్వ అటవీ భూమిని రక్షిస్తూ తమ అధికారిక విధులను నిర్వహించేందుకు సంఘటనా స్థలంలో ఉన్నారు.
పనులు కొనసాగుతున్న సమయంలో కొంతమంది మహిళలు పనులను అడ్డుకోవడంతో పాటు, మహిళా అటవీ సిబ్బందితో సహా అటవీ అధికారులపై దాడి చేసి తోపులాటకు పాల్పడినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అటవీ సిబ్బంది తమను తాము, తమ సహచరులను రక్షించుకునేందుకు, ఘర్షణ నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. సిబ్బంది తీసుకున్న చర్యలు ఆకస్మికంగా జరిగిన దాడికి ప్రతిస్పందనగా, కేవలం ఆత్మ రక్షణ, మరింత గాయాలు జరగకుండా నివారించేందుకు మాత్రమే చేయబడిందని వివర ణ ఇచ్చారు.






