12 August, 2026 | 11:41 AM

‘చేయూత’ పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం

12-08-2026 09:24 AM

ఈ నెల 31 వరకు అవకాశం.. అర్హులు సద్వినియోగం చేసుకోవాలి

బూర్గంపాడు,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘చేయూత’ పింఛను పథకానికి అర్హులైన వారు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని బూర్గంపాడు ఎంపీడీవో జమలారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్‌ బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను సంబంధిత గ్రామపంచాయతీ లేదా మండల పరిషత్‌ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.

ఇవీ అర్హతలు.. అవసరమైన ధ్రువపత్రాలు

వితంతువులు: 18 ఏళ్లు పైబడి ఉండాలి. భర్త మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.

ఒంటరి మహిళలు: భర్త వదిలివేసిన వారు కనీసం ఏడాది పాటు విడిగా నివసించి ఉండాలి. విడాకుల కోర్టు ఉత్తర్వు లేదా తహసీల్దార్‌ విచారణ నివేదిక అవసరం. అవివాహిత మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో 30, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్లు పైబడి ఉండాలి. పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు అధికారి ధ్రువీకరణ అవసరం.

దివ్యాంగులు: వయోపరిమితి లేదు. కనీసం 40 శాతం వైకల్యం ఉండాలి. వినికిడి వైకల్యానికి 51 శాతం ఉండాలి. సదరం ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.

కల్లుగీత కార్మికులు: 50 ఏళ్లు పైబడి ఉండాలి. కల్లుగీత కార్మికుల సహకార సంఘం సభ్యత్వంతో పాటు ఎక్సైజ్‌ శాఖ ధ్రువీకరణ అవసరం.

చేనేత కార్మికులు: 50 ఏళ్లు పైబడి ఉండాలి. చేనేత, జౌళి శాఖ ధ్రువీకరణ పత్రం అవసరం.

ఫైలేరియా బాధితులు: వయోపరిమితి లేదు. గ్రేడ్‌-2, గ్రేడ్‌-3 ఫైలేరియా బాధితులు అర్హులు. డీఎంహెచ్‌వో నమోదు, ధ్రువీకరణ అవసరం.

డయాలసిస్‌ బాధితులు: వయోపరిమితి లేదు. డయాలసిస్‌ చికిత్స పొందుతున్న వారు అర్హులు. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ నమోదు, ధ్రువీకరణ అవసరం.

గడువు తర్వాత దరఖాస్తులు స్వీకరించం

ఈ నెల 31వ తేదీ తర్వాత అందే దరఖాస్తులను పరిశీలించబోమని ఎంపీడీవో జమలారెడ్డి స్పష్టం చేశారు. అర్హత ఉన్న వారు చివరి రోజు వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.