24 August, 2026 | 11:20 PM

ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్

24-08-2026 09:59 PM

పదో తరగతిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన వారికి ఏటా రూ.15 వేల ప్రోత్సాహకం

ఆలేరు,(విజయక్రాంతి): ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచి స్కాలర్‌షిప్ అందించనున్నట్లు రంగారెడ్డి జిల్లా షాబాద్ తహసీల్దార్ ఎండీ అన్వర్ తెలిపారు. తాను చదువుకున్న పాఠశాలలో విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పాటుగా తన అన్నయ్య దివంగత ఎండీ గౌస్ పేరుతో ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలలో సోమవారం నిర్వహించిన రోల్ మోడల్ కార్యక్రమంలో పాల్గొన్న అన్వర్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు.

చదువుకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారకూడదని, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని అన్నారు. ఎస్సెస్సీలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థికి రూ.10 వేలు, ద్వితీయ స్థానం పొందిన విద్యార్థికి రూ.5 వేల చొప్పున ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్ అందజేస్తామని తెలిపారు. గత మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో ప్రథమ స్థానం సాధించిన ఎండీ సమ్రిన్‌కు ఈ ఏడాదికి సంబంధించిన రూ.10 వేల స్కాలర్‌షిప్‌ను అందజేశారు.